India Vs Bharat Row:


NCERT కీలక నిర్ణయం 


ఇండియా పేరుని భారత్‌గా మార్చేస్తారంటూ చాలా రోజులుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన G20 సదస్సులోనూ ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న చోట India కి బదులుగా Bharat అని రాసుండటం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఇకపై NCERT పుస్తకాల్లో India అనే పేరుని తొలగించనున్నారు. ఆ స్థానంలో Bharat అని ముద్రించనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసి చర్చించారు. ఆ తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై (National Council of Educational Research and Training) NCERT పుస్తకాల్లో India అనే పేరు కనిపించదు. కొన్ని నెలల క్రితమే ఈ ప్రతిపాదనలు రాగా..ప్యానెల్‌ చర్చలు జరిపింది. ప్యానెల్‌లోని సభ్యులంతా అందుకు ఆమోదం తెలపడం వల్ల అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది NCERT.






G20 సదస్సు సమయంలోనే ఈ చర్చ బాగా జరిగింది. ఆ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ ఆహ్వానంలో President of India కి బదులుగా President of Bharat అని రాసుంది. ఇది రాజకీయంగానూ కాస్త అలజడి రేపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1)లో "India, that is Bharat" అని స్పష్టంగా రాసుంది. అందుకే...కేంద్రం ఇండియాకి బదులుగా భారత్ పేరునే పాలనా వ్యవహారాల్లో వినియోగించాలని యోచిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన సంకేతాలనూ ఇచ్చింది. మరో కీలక విషయం ఏంటంటే...NCERT పుస్తకాల్లో "Hindu Victories" పేరిట ప్రత్యేకంగా ఓ పాఠం చేర్చాలని ప్రతిపాదించింది. అదే విధంగా చరిత్రకు సంబంధించిన పాఠాల్లోనూ మార్పులు చేయాలని తెలిపింది. బ్రిటీష్ వాళ్లు చెప్పిన చరిత్రను పూర్తిగా పక్కన పెట్టేయాలని భావిస్తోంది. వీటితో పాటు సిలబస్‌లో Indian Knowledge System (IKS)ని ప్రవేశపెట్టాలని ప్యానెల్ ప్రతిపాదించింది.


పశ్చిమబెంగాల్‌కి చెందిన బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరు భారత్‌గా కచ్చితంగా మారి తీరుతుందని, ఇది ఇష్టం లేని వాళ్లు దేశం వదిలి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. ఖరగ్‌పూర్‌లో ఛాయ్‌ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసిన దిలీప్ ఘోష్...భారత్ అనే పేరు పెట్టడాన్ని సమర్థించారు. బెంగాల్‌లో కొందరి విదేశీయుల విగ్రహాలు పెట్టారని, తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ తొలగిస్తామని వెల్లడించారు. మరో సీనియర్‌ నేత రాహుల్ సిన్హా కూడా భారత్‌ అని పేరు మార్చడాన్ని సమర్థించారు. దేశానికి రెండు పేర్లు ఉండడం సరికాదని, భారత్‌ అనే పేరు ఖరారు చేసుకోవడం సబబే అని స్పష్టం చేశారు. G20 సదస్సులో భారత్ పేరుని ప్రమోట్ చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిందని తెలిపారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. దేశంలో ఇన్ని సమస్యలుంటే, పేరు గురించి అనవసరపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: పుల్వామా దాడి తరవాత మోదీ నా నోరు మూయించారు, రాహుల్ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు