Rahul Gandhi Interviews Satya Pal Malik:
ఇంటర్వ్యూ చేసిన రాహుల్..
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Interview) ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik Interview)ని ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు సత్యపాల్ మాలిక్. పుల్వామా దాడులతోపాటు అదానీ వ్యవహారం, మణిపూర్ హింస, కులగణన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. 2019లో జరిగిన పుల్వామా దాడికి (Pulwama Attack) కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని మరోసారి మండి పడ్డారు. వ్యవస్థ విఫలం కావడం వల్లే 40 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చిందని మండి పడ్డారు. భద్రతా పరమైన లోపాలను ఎత్తి చూపినందుకు ప్రధాని నరేంద్ర మోదీ తనను మౌనంగా ఉండాలని హెచ్చరించినట్టూ ఆరోపించారు.
"పుల్వామా దాడి ఎందుకు జరిగిందని నన్ను చాలా మంది అడిగారు. ఆ సమయంలో సైనికులు 5 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కావాలని అడిగారు. ఒకవేళ వాళ్లు నన్ను అడిగి ఉంటే నేను వాళ్లకు కచ్చితంగా వాటిని ఏర్పాటు చేసే వాడిని. ఓ సారి కొంత మంది విద్యార్థులు మంచులో చిక్కుకుపోతే ప్రత్యేకంగా ఎయిర్‌క్రాఫ్ట్ పంపి వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేలా చొరవ తీసుకున్నాను. ఢిల్లీలో ఎయిర్‌క్రాఫ్ట్‌లను చాలా సులభంగా అద్దెకి తీసుకోవచ్చు. కానీ హోం శాఖ మాత్రం సైనికుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఇవ్వలేదు. చేసేదేమీ లేక వాళ్లంతా రోడ్డు మార్గంలోనే వెళ్లారు"
- సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్
మాట్లాడనివ్వలేదు..
పుల్వామా దాడి జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో (PM Modi) మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ అప్పుడు సాధ్యపడలేదని వివరించారు సత్యపాల్ మాలిక్. ఆ తరవాత మోదీయే కాల్ చేసి మాట్లాడినట్టు చెప్పారు. మన తప్పిదం వల్లే అంత మంది చనిపోయారని మోదీతో వాదించినట్టు తెలిపారు.
"పుల్వామా దాడి జరిగినప్పుడు మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఆ తరవాత సాయంత్రం మోదీ నాతో ఫోన్‌లో మాట్లాడారు. మన తప్పిదం వల్ల ఇదంతా జరిగిందని చెప్పాను. ఈ విషయంలో ఎక్కడా ఏమీ మాట్లాడొద్దని ఆయన నాకు చెప్పారు. ఆ తరవాత అజిత్ దోవల్ నాకు కాల్ చేశారు. ఆయన కూడా నన్ను వారించారు. కానీ అప్పటికే నేను మీడియాతో మాట్లాడాను. నా వ్యాఖ్యల వల్ల విచారణ తప్పుదోవ పట్టే అవకాశముందని అనుకున్నాను. కానీ అసలు విచారణే జరగలేదు. ఆ తరవాత మోదీ వచ్చి ప్రసంగించి దాన్ని కూడా రాజకీయం చేసుకున్నారు"
- సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్
మణిపూర్ హింసపై..
మణిపూర్ హింసపైనా మాట్లాడారు సత్యపాల్ మాలిక్. ప్రభుత్వం కల్పించుకోనంత వరకూ అక్కడ ప్రశాంతంగానే ఉందని, ఆ తరవాతే అల్లర్లు మొదలయ్యాయని ఆరోపించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చి చెప్పారు. కుల గణనపైనా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కీలకమైన సమస్యల్ని చర్చించకుండా దాటవేస్తోందని విమర్శించారు. అదానీ వ్యవహారంపైనా నోరు మెదపడం లేదని మండి పడ్డారు. ప్రజలు తమ డబ్బంతా అదానీ వద్దే ఉందన్న ఆందోళనలో ఉన్నారని, రూ.20 వేల కోట్ల వ్యవహారం గురించి మాట్లాడితే మౌనంగా ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: NCERT పుస్తకాల్లో ఇండియాకి బదులుగా 'భారత్' పేరు, ప్యానెల్ కీలక నిర్ణయం