Delhi Air Quality: 


తగ్గిన వాయు నాణ్యత 


ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ (Delhi Air Quality) దారుణంగా పడిపోయింది. ఏటా చలికాలం రాగానే అక్కడి ప్రజలకు ఈ తిప్పలు తప్పడం లేదు. ఎక్కడ చూసినా దుమ్ము ధూళి కమ్మేస్తున్నాయి. దీనికి తోడు కాలుష్యం ఇంకాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంగా స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు అవకాశం లేకుండా పోతోంది. ఈ సారి పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి దేశ రాజధానిలో వాయు నాణ్యతను "Poor" కేటగిరీగా ప్రకటించారు. చాలా చోట్ల పొగమంచు కమ్మేసింది. ఇవాళ ఉదయం (అక్టోబర్ 25) 7 గంటల సమయానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో (Delhi Air Quality Index) వాయు నాణ్యత 235కి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీలో చాలా చోట్ల వాయు నాణ్యత ప్రమాదకరంగానే ఉంది. గుడ్‌గావ్‌లో AQI 158, గ్రేటర్ నోయిడాలో 248, నోయిడాలో 170, ఫరియాబాద్‌లో 179గా ఉంది. ఢిల్లీలోన కాకుండా మరి కొన్ని ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత తగ్గిపోయింది. అహ్మదాబాద్‌లో 141,చెన్నైలో 126, లఖ్‌నవూలో 150,ముంబయిలో 163, పట్నాలో 142, పుణేలో 126, జైపూర్‌లో 134గా నమోదైనట్టు CPCB స్పష్టం చేసింది. సాధారణంగా AQI 0-50 మధ్యలో ఉంటే మెరుగ్గా ఉన్నట్టు పరిగణిస్తారు. 101-200 మధ్య ఉంటే "Moderate"గా, 201-300 మధ్య ఉంటే "Poor" అని, 301-400 మధ్య ఉంటే "Very Poor", 401-500 మధ్య ఉంటే "Severe"గా పరిగణిస్తారు అధికారులు. 






పొగ మంచు..


ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలికాలం ఇంకా పూర్తిగా మొదలు కాకముందే కాలుష్య స్థాయి తీవ్రంగా పెరిగిపోయిందని  అంటున్నారు. ఉదయం 5 గంటల నుంచే పొగ మంచు కప్పేస్తోంది. కాసేపు కూడా బయట ఉండేందుకు వీల్లేకుండా పోతోంది. మార్నింగ్‌ వాక్‌కి వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యాన్ని భరించలేక వెనక్కి మళ్లుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 24 గంటల్లో సగటు వాయు నాణ్యత 220గా నమోదైంది. అంతకు ముందు ఇది 263గా ఉంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే నాణ్యత కాస్త మెరుగైనప్పటికీ...ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దసరా వేడుకల్లో బాణసంచా కాల్చడమూ కాలుష్యాన్ని పెంచేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీలో 8 పొల్యూషన్ హాట్‌స్పాట్స్‌ని (Delhi Pollution Hotspots) గుర్తించినట్టు చెప్పారు. ఇప్పటికే 13 హాట్‌స్పాట్‌లను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మరో 8 ఆ జాబితాలో చేర్చింది. గాల్లోని దుమ్ముని తగ్గించేందుకు ప్రత్యేక పౌడర్‌ని వినియోగించనుంది.