Lebanon Woman Priestess:
ఆలయంలో క్రైస్తవ యువతి..
"అర్చకత్వం పురుషులే చేయాలి..స్త్రీలు ఆ వృత్తికి పనికి రారు" ఇదంతా పాత మాట. ఇప్పుడు ఆడవాళ్లు కూడా అర్చకత్వం చేస్తున్నారు. ఈ మధ్యే తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందుకోసం ఓ కోర్స్ కూడా పెట్టి ఇద్దరు యువతులను అపాయింట్ చేసింది. అప్పట్లో ఇది చాలా ఆసక్తికర చర్చకు దారి తీసింది. అదే ఆసక్తికరం అనుకుంటే..ఇప్పుడు అంతకన్నా ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూర్‌లోని ఈశా యోగా సెంటర్‌లోని (Isha Yoga Centre) లింగా భైరవి ఆలయంలో ఓ మహిళ అర్చకత్వం చేస్తోంది. ఇది కొంత వరకూ ఆశ్చర్యమే. కానీ...ఇంకో సర్‌ప్రైజ్ కూడా ఉంది. ఆమె ఓ క్రిస్టియన్. పైగా...ఇండియన్ కూడా కాదు. లెబనాన్‌కి చెందిన మహిళ ఇక్కడికి వచ్చి ఆలయంలో అర్చకత్వం చేస్తోంది. ఆమె అసలు పేరుతో కన్నా భైరాగిని మా హనీన్ (Bhairagini Maa Hanine)గానే అందరికీ పరిచమయైంది. లక్షల రూపాయల జీతమున్న ఉద్యోగాన్ని కాదనుకుని మరీ ఇలా దైవ సన్నిధిలోనే జీవితాన్ని గడపాలనుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అనుకున్న వెంటనే ఈశా యోగా సెంటర్‌లో చేరిపోయింది. అప్పటి నుంచి భైరవి ఆలయంలో సేవలు అందిస్తోంది. ఎరుపు చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని నిజమైన హిందువులా వేషాన్ని మార్చుకుంది. భక్తులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. లెబనాన్‌లో ఓ సంస్థలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసింది ఈ యువతి. వయసు పాతికేళ్లే. కానీ దైవభక్తి చాలా ఎక్కువ. అందుకే విలాసవంతమైన జీవితాన్ని కాదనుకుని మరీ ఇలా ఈశా యోగా సెంటర్‌లో చేరింది. మరి ఎందుకీ నిర్ణయం తీసుకున్నారని ఎవరైనా అడిగితే...ఇదిగో ఇలా సమాధానం చెబుతోంది..
"నేను లెబనాన్ నుంచి వచ్చాను. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ చేశాను. ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాను. కానీ..ఈ ఈశా యోగా సెంటర్ గురించి తెలిశాక 2009లో ఫుల్‌టైమ్ వాలంటీర్‌గా చేరిపోయాను. దాదాపు 14 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు భక్తి, యోగా గురించి ఏమీ తెలియదు. ఆ సమయంలోనే నా స్నేహితురాలు చనిపోయింది. చాలా ప్రశ్నలు నా మనసులో మెదిలాయి. ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నించాను. అప్పుడే ఈశా యోగా సెంటర్‌లో ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ చేశాను. వెంటనే లెబనాన్‌కి వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశాను. ఇక్కడ ఇలా ఉండడం నాకు చాలా సంతృప్తినిస్తోంది"
- భైరాగిని మా హనీన్
జీవితం అంకితం..
ఈశా యోగా సెంటర్‌లో కోర్స్ చేసిన తరవాత తనకు ఎంతో ప్రశాంతత వచ్చిందని, అందుకే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నానని చెబుతోంది ఈ యువతి. కొన్నేళ్ల క్రితం సద్గురుతో (Isha Sadhguru) కలిసి భైరాగి మా ని దర్శించుకున్నానని, అప్పటి నుంచి జీవితం మారిపోయిందని వివరిస్తోంది. ఆ దేవత రంగు ఎరుపు అని, అందుకే తాను ఎప్పుడూ ఎర్ర చీర కట్టుకుని ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఇప్పటికీ తాను క్రైస్తవురాలినేనని, కాకపోతే హిందూ ధర్మం గురించి కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందని అంటోంది. తన జీవితాన్ని ఇలాగే అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది.
Also Read: ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి, ఢిల్లీలో దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ