Mysuru Dasara celebrations:
దసరా వేడుకలు ముగింపు..
మైసూరులో దసరా వేడుకలు ( Mysuru Dasara celebrations 2023) ఘనంగా ముగిశాయి. ఏనుగుల మార్చ్‌తో ఉత్సవాల్ని ముగించారు. దీన్నే జంబో సవారీ ( Mysuru Jumbo Savari) అంటారు. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది తరలి వచ్చారు. ఈ సవారీని అభిమన్యు అనే ఓ ఏనుగు (Abhimanyu Elephant) ముందుండి నడిపించింది. ఈ ఏనుగుపైనే దాదాపు 750 కిలోల బరువున్న చాముండేశ్వరి దేవి బంగారు పల్లకిని ఊరేగించారు. మైసూర్ ప్యాలెస్ ప్రాంగణం నుంచి బన్నిమంటపం వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. అభిమన్యు ఏనుగుపై ఇలా అమ్మవారిని ఊరేగించడం వరుసగా నాలుగోసారి. ఈ ఏనుగుతో పాటు ఈ ర్యాలీలో మహేంద్ర, గోపి, రోహిత్, లక్ష్మి, విజయ, వరలక్ష్మి తదితర ఏనుగులూ పాల్గొన్నాయి. ఈ ఏనుగులన్నింటినీ అందమైన పెయింట్‌లతో అలంకరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జంబో సవారీని ప్రారంభించారు. ఈ సవారిని గౌరవ వందనంతో మొదలు పెట్టారు. కోటె ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన సిద్దరామయ్య అక్కడ పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. మైసూరు దసరా ఉత్సవాల్లో జంబో సవారీయే ప్రధాన ఆకర్షణ. రకరకాల ఎలిఫెంట్ క్యాంప్‌ల నుంచి ఏనుగుల్ని తీసుకొచ్చి ఈ వేడుకలకు సిద్ధం చేస్తారు. అందంగా తీర్చి దిద్దుతారు. ఈ వేడుకల్ని చూసేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.
400 ఏళ్ల చరిత్ర..
కేఆర్ సర్కిల్ మీదుగా ఈ సవారీ కొనసాగింది. ఈ ఉత్సవాల్లో కర్ణాటకలోని అన్ని రకాల సంస్కృతుల్నీ ప్రదర్శిస్తారు. బీదర్, కలబుర్గి, మాండ్యా, రామ్‌నగర్, హసన్, గడగ్, ధార్వాడ్, యాద్గిర్, చిక్కమంగళూరు, కోలార్, బల్లారి, బెలగావి సంస్కృతులను ప్రదర్శనకు ఉంచారు. అక్టోబర్ 15న చాముండి హిల్స్ వద్ద మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ కన్నడ గేయ రచయిత హంసలేఖ ఈ వేడుకల్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. మైసూరు రాజులు ఉన్నప్పటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. చాలా ఏళ్లుగా ప్రభుత్వమే అధికారికంగా ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తోంది. స్థానికంగా వీటిని Nadda Habba గా పిలుచుకుంటారు.