ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాపై అమెరికాలోని 40కి పైగా రాష్ట్రాలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. పిల్లలను వేధింపులకు గురి చేసి మెటా ఆదాయం పొందుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశాయి. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాలు ప్రజల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, వారి ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రాలు ఈ కేసులు వేశాయి. రికార్డు స్థాయిలో పిల్లలు, యుక్తవయస్కులు పేలవమైన మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ అన్నారు.


ఇందుకు మెటా వంటి సోషల్ మీడియా కంపెనీలే కారణమని లెటిటియా జేమ్స్ చెప్పారు. కాలిఫోర్నియా, ఇల్లినాయిస్‌ సహా 33 రాష్ట్రాల్లో ఫేస్‌బుక్‌ను కూడా నిర్వహించే మెటా తన వేదికల ద్వారా గణనీయమైన ప్రమాదాల గురించి ప్రజలను పదేపదే తప్పుదోవ పట్టిస్తోందని, చిన్నపిల్లలు, యువతను ఉద్దేశపూర్వకంగా వ్యసనానికి గురిచేస్తోందని ఓక్లాండ్, కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టుల్లో మంగళవారం దాఖలు చేసిన ఫిర్యాదులో ఆరోపించాయి.


మెటా, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తూ యువత డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి, విద్య, రోజువారీ జీవితంలో జోక్యం, అనేక ఇతర సమస్యలతో బాధ పడుతున్నట్లు పరిశోధనలో తేలిందట. యువతను, యుక్తవయస్కులను ప్రలోభపెట్టడానికి, తమ ఫ్లాట్‌ఫారం వలలో వేసుకోవడానికి శక్తివంతమైన, అపూర్వమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని  మెటా ఉపయోగించుకుందని, లాభార్జనలే దీని ఉద్దేశమని అని ఫిర్యాదులో ఆరోపణలు చేశారు.  


కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో మెటా తన ఆర్థిక లాభాలను పెంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల గురించి ప్రజలను పదే పదే తప్పుడు ప్రచారాలు చేసి తప్పు దోవ పట్టిస్తోందని ఆరోపించింది. ప్రమాదకరమైన కంటెంట్ తయారు చేయడానికి ప్రత్యేక అల్గారిథమ్‌ను ఉపయోగిస్తూ వినియోగదారులు ఎక్కువ శాతం సమయాన్ని యాప్‌పై గడిపేలా చేస్తూ వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తోందని, ఫలితంగా వారిని దోపిడీ చేసిందని 


మెటావర్స్‌ భాగమైన హారిజన్ వరల్డ్ వర్చువల్ రియాలిటీతో సహా, మెటా తన ప్లాట్‌ఫారమ్‌ల భద్రత గురించి ప్రజలను తప్పుదారి పట్టించిందని అమెరికా రాష్ట్రాలు దావా వేస్తున్నాయి. యువతను ప్రలోభ పెట్టేలా టాక్సిక్ కంటెంట్ కోసం ప్రత్యేకంగా అల్గారిథమ్‌లను ఉపయోగిస్తున్నట్లు ఆరోపించాయి. వాటిని వినియోగించే వారు ప్లాట్‌ఫారమ్‌లకు వ్యసనపడుతున్నారని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. 


మెటాపై వరుసగా వేస్తున్న వ్యాజ్యాలతో ఆ సంస్థ షేర్లు కొద్దిగా క్షీణించాయి. ఈ  వ్యాజ్యాలపై మెటా స్పందిందించి. టీనేజర్లు ఉపయోగించే అనేక యాప్‌ల కోసం స్పష్టమైన, వయస్సు, తగిన ప్రమాణాలను రూపొందించడానికి సంస్థలతో పనిచేయడానికి బదులుగా అటార్నీ జనరల్ ఈ మార్గాన్ని ఎంచుకున్నందుకు నిరాశ చెందినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 


టీనేజర్లు తమ కంటెంట్‌కు లైక్‌లు, కామెంట్ల పొందే క్రమంలో సోషల్ మీడియాలో వీలైనంత ఎక్కువ సమయం గడిపేలా చూసేందుకు మెటా ప్రయత్నిస్తుందని దావాలు నమోదవుతున్నాయి. 2020 నాటికి మెటా తన ప్లాట్‌ఫారమ్‌లపై గరిష్ట సమయాన్ని గడిపేలా, డోపమైన్ ప్రతిస్పందనలను మార్చడానికి వీలుగా అప్లికేషన్లను రూపొందించడం కొనసాగించిందని, యువత, పిల్లలను వ్యసనపరులుగా మార్చడానికి అల్గారిథమ్‌లు రూపొందించనట్లు మెటా వెల్లడించలేదని అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తమపై వస్తున్న ఆరోపణలను మెటా బహిరంగంగా ఖండించింది.