HIV-AIDS Treatment: దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎంతో మంది చావుకు కారణమైన హెచ్ఐవీ/ ఎయిడ్స్‌కు ఎట్టకేలకు ఔషధం కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అయితే కేవలం ఇంజెక్షన్ రూపంలో ఒక్కసారి రోగులకు ఇస్తే ఈ వ్యాధిని నియంత్రించవచ్చని చెబుతున్నారు. ఎయిడ్స్‌కు ఔషధం కనిపెట్టి చరిత్రకెక్కారు ఇజ్రాయెల్‌కు చెందిన టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.


ఎందుకింత ఆలస్యం


ఆధునిక వైద్య చరిత్రలో ఎలాంటి మహమ్మారికైనా ఇట్టే వ్యాక్సిన్ వస్తుంది. శాస్త్రసాంకేతికత అంతగా అభ్యున్నతి చెందింది. కానీ 40 ఏళ్లుగా ఎయిడ్స్‌కు మాత్రం ఎలాంటి ఔషధం కనుగొనలేకపోయారు శాస్త్రవేత్తలు. ఇందుకు కారణం వ్యాధి కారకమైన వైరస్ క్షణానికోసారి రూపాంతరం చెందడమేనట.


ఏదైనా వైరస్‌ లేదా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే నిర్ణీత కణజాలాన్ని కేంద్రంగా చేసుకొని కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఎయిడ్స్‌ (ఎక్వైర్డ్‌ ఇమ్యూనో డిఫీషియెన్సీ సిండ్రోమ్‌)కు కారణమయ్యే హెచ్‌ఐవీ (హ్యూమన్‌ ఇమ్యూనోడిఫీషియెన్సీ వైరస్‌) కూడా నిర్ణీత కణజాలాన్ని కేంద్రంగా చేసుకొనే ప్రభావం చూపుతుంది.


అయితే ఎప్పుడైతే వ్యాధినిరోధక కణాలు క్రియాశీలంగా మారి వైరస్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయో అప్పుడు హెచ్‌ఐవీ వైరస్‌ తన రూపాన్ని మార్చుకుంటుంది. దీంతో ఇమ్యూన్‌ సిస్టమ్‌ ఆ వైరస్‌ను కట్టడి చేయలేకపోతుంది. మిగతా వ్యాధుల విషయంలో ఇలా జరుగడం లేదు. అందుకే, హెచ్‌ఐవీకి ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ తీసుకురాలేకపోయారు.


మరి ఈ వ్యాక్సిన్ ఎలా


శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే తెల్ల రక్త కణాలు (బీ- కణాలు) ఎముక మజ్జలో తయారవుతాయి. పరిపక్వం చెందిన తర్వాత ఇవి ఎముక మజ్జ నుంచి రక్తం, గ్రంథుల వ్యవస్థల్లోకి ప్రవేశిస్తాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ అవయవాలకు చేరుకుంటాయి. బీ-కణాలు ఎదురుపడినప్పుడు హెచ్‌ఐవీ తదితర వైరస్‌లు వాటిపై ప్రభావం చూపి, విచ్ఛిన్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి.


కానీ ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు మాత్రం వైరస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించి ఈ బీ-కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన కణాలు.. వైరస్‌ ఎదురుపడినా, దాని ప్రభావానికి గురికావు. అంతేకాకుండా వైరస్‌ ప్రవర్తనకు అనుగుణంగా తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటాయి. హెచ్‌ఐవీని అడ్డుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. వైరస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తాయి.


క్యాన్సర్‌కు 


ఈ టీకాతో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ నివారణకే కాకుండా క్యాన్సర్‌, రోగనిరోధక వ్యవస్థ స్వీయదాడి చేసుకునే ఆటోఇమ్యూన్‌ వ్యాధుల చికిత్సకూ బాగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతారు. మరింత లోతైన పరిశోధనలు, పరీక్షల అనంతరం ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.


Also Read: Viral Video: ఏం ఎంజాయ్ చేస్తున్నావ్ రా బుడ్డోడా- వాన పడితే ఇట్టుండాలి మరి!


Also Read: Covid Update: బాబూ చిట్టి! మాస్కు పెట్టు నాయనా- ఒక్కరోజే 12వేల కేసులు