Infectious Disease In North Korea: కరోనా విజృంభణతో గజగజ వణుకుతోన్న ఉత్తరకొరియాకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ దేశంలో సరికొత్త అంటువ్యాధి బయటపడింది. ఉత్తర కొరియాలోని ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు.






ఏంటీ వ్యాధి?


ఇది పేగు సంబంధిత వ్యాధిగా అధికారులు భావిస్తున్నారు. దీంతో రోగులకు అవసరమైన మందులను అందిస్తున్నారని జాతీయ అధికార మీడియా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. అయితే ఈ వ్యాధిబారిన ఎంతమందిపడ్డారనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. 


కరోనా కేసులు



ఉత్తర కొరియాలో కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 4,558,260 కరోనా కేసులు నమోదయ్యాయి. 73 మంది మృతి చెందారు. 4,511,950 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో కొత్తగా 26,010 మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. 


ఉత్తర కొరియాలో ప్రస్తుత పరిస్థితులు కేవలం శాంపిల్ అని కరోనా అక్కడ పెను ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఉత్తర కొరియాలో ఆరోగ్య వ్యవస్థ సరిగాలేకపోవడం అని పేర్కొంటున్నారు. అంతేకాకుండా పౌరులకు వ్యాక్సిన్ అందజేయడంలోనూ కిమ్ సర్కార్ ఘోరంగా విఫలమైంది.


లాక్‌డౌన్


కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కిమ్ జాతీయ స్థాయి లాక్‌డౌన్ విధించారు. ఉత్తర కొరియా సైన్యంలో మెడికల్‌ కోర్‌ను కిమ్ రంగంలోకి దింపారు. ప్యాంగ్యాంగ్‌ నగరానికి ఔషధ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.


గతేడాది పలు దేశాలు ఉత్తరకొరియాకు ఆస్ట్రాజెనెకా, చైనా తయారీ టీకాలను ఆఫర్‌ చేశాయి. కానీ, ఉ.కొరియా మాత్రం లాక్‌ డౌన్‌, సరిహద్దుల మూసివేతతోనే వైరస్‌ను అదుపు చేస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చేయిదాటిపోయినట్లు కనిపిస్తున్నాయి. మరి కిమ్ జోంగ్ ఉన్ ఏం చేస్తారో చూడాలి.


Also Read: Pakistan Tea : అప్పులెక్కువయ్యాయి టీ తాగడం తగ్గించుకోండి ప్లీజ్ - ప్రజలను కోరిన పాకిస్థాన్ ! ఎగతాళి చేస్తున్న నెటిజన్లు


Also Read: Chupacabra In Texas Zoo: ఈ వింత జీవి ఏంటో తెలుసా? రాత్రి దర్శనం, పగలు మాయం!