కాలిఫోర్నియా: పాకిస్తాన్ సహా పలు దేశాల్లో ఆలయాలపై ఏదో సందర్భంలో దాడులు జరిగిన ఘటనలు వింటుంటాం. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటన జరిగింది. హిందువులపై విధ్వేషం చిమ్ముతూ కొందరు అమెరికాలోని BAPS హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. కాలిఫోర్నియాలోని ఆలయం వద్ద ముందు గోడలపై భారతీయులకు వ్యతిరేకంగా కొన్ని సందేశాలు రాశారు. అనంతరం కొందరు అల్లరి మూక అక్కడికి చేరుకుని ఆలయంపై దాడి చేసిందని అధికారులు తెలిపారు.
కాలిఫోర్నియాలోని చినో హిల్స్ ఏరియాలో మరో ఆలయంపై దాడి జరిగింది. కొందరు అల్లరిమూకలు హిందువులు పవిత్రంగా భావించే ఆలయంపై విషం చిమ్మారని BAPS పబ్లిక్ అఫైర్స్ సభ్యుడు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆలయం ప్రహరీ గోడలపై భారతీయులకు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా రాతలు రాశారు. అనంతరం గట్టిగా నినాదాలు చేస్తూ ఆలయాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. హిందూ సమాజం ఎల్లప్పుడూ శాంతి కోరుకుంటోందని, ద్వేషానికి వ్యతిరేకంగా నిలుస్తుందన్నారు. మానవత్వానికి విలువ ఇచ్చి, ఎవరిపై తాము దాడులు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు.
అసలే ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసే టారిఫ్ ల భయంతో భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అమెరికాలో చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న వారికి ఉపాధి లేకుండా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనధికారికంగా అమెరికాలో ఉన్నారంటూ వలసదారులను విమానాలలో భారత్ సహా వారి స్వదేశాలకు పంపిచేస్తున్నారు. కెనడా, మెక్సికో, చైనా, రష్యాలపై టారిఫ్ లు వేస్తూ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ భారత్ అని అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది.