ఓ వైపు బుల్లెట్ల వర్షం కురుస్తూంటే .. వాటికి ఎదురుగా ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది ? పై ప్రాణాలు పైనే పోతాయి. బుల్లెట్ తగలక ముందే ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు. అదే చిన్న పిల్లలయితే చెప్పాల్సిన పని లేదు. కానీ  ఆ చిన్నారి మాత్రం బుల్లెట్లు దూసుకొస్తున్న సమయంలో  చురుకుగా ఆలోచించింది. చురుగ్గా ఓ ఐడియాను ఎంచుకుంది. అమలు చేసింది. ఫలితంగా ప్రాణాలు దక్కించుకుంది. 


అమెరికాలోని టెక్సాస్‌లో చిన్న పిల్లలపై దుండగులు జరిపిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఈ ఘటనలో 19 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల విషయం బయట ప్రపంచానికి తెలిపింది మియా సెరిల్లో అనే చిన్నారి . ఆమె ఎలా బుల్లెట్ల నుంచి తప్పించుకుంది.. అనే విషయం ఆ పాప చెబితే కానీ అందరికీ తెలియలేదు. 





 మియా అందరితో పాటే స్కూల్లో పాఠాలు వింటున్నప్పుడే గన్‌తో దుండగుడు దూసుకొచ్చాడు . వచ్చీ రావడంతోనే కాల్పులు ప్రారంభించాడు. పిల్లలతో పాటు టీచర్‌ను కాల్చేశాడు. తాను బతికున్నట్లు తెలిస్తే తననూ చంపేస్తాడేమోనని వెంటనే... చనిపోయిన తన స్నేహితురాలి శరీరంపై ఉన్న రక్తాన్ని తన శరీరంపై చల్లుకుంది. కిందపడి చనిపోయినట్లు నటించింది. అందర్నీ కాల్చేసి తీరిగ్గా దుండగుడు క్లాస్ నుంచి బయటకు వెళ్లాడు. 



ఆ తర్వాత టీచర్‌ చేతిలో ఫోన్‌ తీసుకుని 911 నంబరుకు ఫోన్‌ చేసింది మియా.  ఈ ఘటనలో మియాకు స్వల్ప గాయాలవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.  అయితే కళ్లముందే మారణహోమాన్ని చూసిన మియా తీవ్ర భయాందోళనకు గురైంది. రాత్రంతా ఏడుస్తూనే ఉందని ఆమె తండ్రి మీడియాకు తెలిపారు.  


రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని తీవ్రంగా కదిలిస్తోంది. సాల్వడార్‌ రామోస్‌ అనే 18 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లుగా గుర్తించారు.