France Muslim Abaya Ban: ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో పాఠశాలల్లో ఇస్లామిక్ అబాయా దుస్తులను నిషేధించనున్నట్లు ప్రకటించింది. లౌకిక చట్టాలను ఉల్లంఘించడాన్ని ఉటంకిస్తూ త్వరలో పాఠశాలల్లో అబయా దుస్తులు నిషేధించనున్నట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరానికి ముందు పాఠశాల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు, నియమాలను అందజేస్తామని దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ ఆదివారం చెప్పారు.
కొంతమంది ముస్లిం విద్యార్థలు అబాయా దుస్తులు ధరించి రావడంతో పాఠశాలల్లో లౌకిక చట్టాలకు ఉల్లంఘటన ఏర్పడుతోందన్నారు. వాటిని నివారించడానికి ఈ నిర్ణయ తీసుకున్నట్లు గాబ్రియేల్ చెప్పారు. ఇకపై పాఠశాలలో అబాయా ధరించడం సాధ్యం కాదని, సెప్టెంబర్ 4 నుంచి దేశవ్యాప్తంగా తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలకు జాతీయ స్థాయిలో స్పష్టమైన నియమాలు., ఆదేశాలు ఇస్తామని చెప్పారు.
ఫ్రెంచ్ పాఠశాలల్లో అబాయాలు ధరించడంపై నెలల తరబడి చర్చ జరిగింది. దీనిపై విచారణ జరిపిన ఫ్రాన్స్ ప్రభుత్వం పాఠశాలల్లో అబయాలు ధరించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలు తేల్చింది. ఎట్టకేలకు వాటిపై నిషేధం విధిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు, వామ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పౌరుల హక్కులను హరించడమేనని వాదించాయి.
అబయా ఒక మతపరమైన సంజ్ఞగా అభివర్ణించారు అటల్. అబయాతో లౌకికత్వం దెబ్బతింటుందని, దానిని రక్షించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అబయా కాకుండా విద్యార్థులందరూ ఒకే విధమైన వస్త్రధారణతో పాఠశాలకు రావాల్సి ఉంటుందన్నారు. తరగతి గదిలోకి ప్రవేశించినప్పుడు విద్యార్థులను చూసి వారి మతాన్ని గుర్తించడం సాధ్యం కాదన్నారు. విద్యార్థులు అందరూ సమానమే అన్నారు. 2004 చట్టంలో పాఠశాలల్లో విద్యార్థులు మతపరమైన సంకేతాలు, దుస్తులను ధరించడాన్ని నిషేధించింది. ఇందులో పెద్ద శిలువలు, యూదు కిప్పాస్, ఇస్లామిక్ హెడ్‌స్కార్ఫ్ (హిజాబ్)లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అబాయాలపై ఎటువంటి నిషేధం లేదు. తాజాగా మతపరమైన వస్తువులు, నిషేధిత దుస్తుల జాబితాలో అబయాను ప్రభుత్వం చేర్చింది.
మిశ్రమ స్పందన
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వచ్చింది. గాబ్రియేల్ అట్టల్ కంటే ముందున్న విద్యా మంత్రి పాప్ ఎన్‌డియాయే ఇలాంటి విషయంపై అయిష్టతను వ్యక్తం చేశారు. ఒక యూనియన్ నాయకుడు, బ్రూనో బాబ్కీవిచ్ అటల్ ప్రకటనను స్వాగతించారు. సూచనలు స్పష్టంగా లేవని, ప్రధాన ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న NPDEN-UNSA ప్రధాన కార్యదర్శి బాబ్కీవిచ్ అన్నారు. అయినా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నేత రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ అధినేత ఎరిక్ సియోట్టో సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. పాఠశాలల్లో అబయాలను నిషేధించాలని తాము చాలాసార్లు పిలుపునిచ్చామని చెప్పారు
కానీ వామపక్ష ప్రతిపక్షమైన ఫ్రాన్స్ అన్‌బోడ్ పార్టీకి చెందిన క్లెమెంటైన్ ఔటైన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. విద్యా శాఖ మంత్రి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఫ్రాన్స్ లౌకిక విలువల స్థాపక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ముస్లింలపై కక్ష పూరితమైన ఆలోచనల్లో ప్రభుత్వం ఉందన్నారు. CFCM అనే జాతీయ ముస్లిం సంస్థ, దుస్తులు మాత్రమే మతపరమైన సంకేతం కాదని పేర్కొంది. 2020లో పారిస్ శివారులోని ఓ పాఠశాలలో ప్రవక్త మహమ్మద్‌పై వ్యంగ్య చిత్రాలను ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీ విద్యార్థులకు చూపించారు. ఆ సమయంలో ఓ ముస్లిం శరణార్థి ఉపాధ్యాయుడి తల నరికివేశాడు. అప్పటి నుంచి పాఠశాలల్లో పాఠశాలల్లో అబయా నిషేధంపై చర్చ తీవ్రమైంది.