అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన పేరును మారుమోగేలా చేస్తున్నారు భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి. రిపబ్లికన్‌ పార్టీ తరఫున చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. తన మాటలతో, వాదనలతో ఎంతో మందిని ఫిదా చేస్తున్నారు. స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా వివేక్‌ మాటలను మెచ్చుకున్నారు. ఆయన ట్వీట్‌లను రీట్వీట్‌ చేస్తున్నారు. కేవలం 38 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉండడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రసంగాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఎలాన్‌ మస్క్‌ మాట్లాడుతూ.. వివేక్‌ రామస్వామి చాలా ఆశాజనక అమెరికా అధ్యక్ష అభ్యర్థి అని ప్రశంసించారు.


కాగా తాజాగా వివేక్‌  రామస్వామి మీడియాతో మాట్లాడుతూ ఎలాన్‌ మస్క్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌ను తన అడ్వైజర్‌గా నియమించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ద హిల్‌ అనే మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యాపార వేత్త అయిన వివేక్‌ రామస్వామి లోవా టౌన్‌ హాల్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. తన పరిపాలనకు గైడెన్స్‌ ఇవ్వడానికి 'బ్లాంక్‌  ఫ్రెష్‌ ఇమ్‌ప్రెషన్‌' ఉన్న వారిని తీసుకుంటానని అన్నారు. అందులో భాగంగానే స్పేస్‌ ఎక్స్‌, టెస్లా, ఎక్స్‌ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో ఎలాన్‌ మస్క్‌ గురించి ఎక్కువగా తెలుసుకోవడాన్ని తాను ఎంజాయ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ట్విట్టర్‌లో ఏకంగా 75 శాతం మంది ఉద్యోగులను తొలగించిన అతను నాకు చాలా ఆసక్తికరమైన సలహాదారుగా ఉండగలరని ఆశిస్తున్నట్లు అన్నారు. 


వివేక్‌ రామస్వామి గతంలో కూడా సోషల్‌ మీడియా కంపెనీ ఎక్స్‌ (ట్విట్టర్‌) మేనేజ్‌మెంట్‌ విషయంలో ఎలాన్‌ మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. మస్క్‌ ఏ విధంగా అయితే కంపెనీని రన్‌ చేస్తున్నారో.. తాను ప్రభుత్వాన్ని అదే విధంగా నడిపించాలనుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఫాక్స్‌ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్‌ రామస్వామి మాట్లాడుతూ.. ట్విట్టర్‌ విషయంలో అతను చేసింది మంచి ఉదాహరణ అని, తాను అడ్మినిస్ట్రేషన్‌ విషంలో అలానే చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అనవసరమైన భారాన్ని 75 శాతం తగ్గించుకుని, వాస్తవంగా అవసరమైన చోట దాన్ని ఉపయోగించి మెరుగుపరుచుకోవాలని అన్నారు. అతను ట్విట్టర్‌ ద్వారా ఎక్స్‌ పెట్టాడని, తాను అడ్మినిస్ట్రేటివ్‌ స్టేట్‌ ద్వారా పెద్ద క్రాస్‌ (ఎక్స్‌) పెడతానని, కాబట్టి తనవి, మస్క్‌వి వ్యూహాలు ఒకేలా ఉన్నాయని అన్నారు.


ఇటీవల ఎలాన్‌ మస్క్‌ మాట్లాడుతూ.. వివేక్‌ రామస్వామి చాలా ఆశాజనక అమెరికా అధ్యక్ష అభ్యర్థి అని ప్రశంసించారు. ఎలాన్‌ మస్క్‌ గతంలో ది హిల్‌ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ట్విట్టర్‌ను తాను నష్టానికి కొనుగోలు చేసిన తర్వాత వర్క్‌ ఫోర్స్‌ను 8000 నుంచి 1500 కు తగ్గించినట్లు వెల్లడించారు. 


వివేక్‌ రామస్వామి తల్లిదండ్రులు కేరళ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కుటుంబం హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. అయితే వివేక్‌ అమెరికాలోనే పుట్టారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి బయాలజీ చదివారు. యేల్‌ లా స్కూల్‌ నుంచి లాయర్‌ పట్టా పొందారు. హార్వర్డ్‌ పొలిటికల్‌ యూనియన్‌కు అధ్యక్షుడిగానూ పనిచేశారు. చర్చలంటే రామస్వామికి ఎంతో ఆసక్తి. ప్రస్తుతం అమెరికాలో టాప్‌ యువ బిలియనీర్లలో రామస్వామి ఒకరు. 2014లో రోవెంట్‌ సైన్సెస్‌ అనే సంస్థను స్థాపించి బయోటెక్‌ రంగంలో అతిపెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదిగారు.