Cairo church Fire : ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. కైరోలోని కాప్టిక్ చర్చిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. ఆదివారం ఈజిప్టు రాజధాని కైరోలోని రద్దీ అధికంగా ఉన్న చర్చిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 41 మంది మరణించారని, 14 మంది గాయపడ్డారని ఆ దేశ కాప్టిక్ చర్చి తెలిపింది. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చిలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే స్థానిక పోలీసుల కథనం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయని అంటున్నారు.  


అధ్యక్షుడు దిగ్భ్రాంతి 


ఆదివారం ఉదయం చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని కాప్టిక్ చర్చి నిర్వాహకులు తెలిపారు.  మంటలను ఆర్పడానికి పదిహేను అగ్నిమాపక వాహనాలు ప్రయత్నిస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.  ఈ ప్రమాదంపై ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిస్సీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాప్టిక్ క్రిస్టియన్ పోప్ తవాద్రోస్ II తో అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రెసిడెంట్ కార్యాలయం తెలిపింది. ఈ విషాదకర ఘటనపై సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు అధ్యక్షుడు ఎల్-సిస్సీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.  ఈజిప్టులోని 90 మిలియన్ల జనాభాలో 10% క్రైస్తవులు ఉన్నారు.