Imran Khan Arrest: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రెక్ - ఎ - ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan Arrest) అరెస్టు అయ్యారు. ఆయన్ను ఇస్లామాబాద్‌ హైకోర్టు బయట పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పీటీఐ లాయర్ ఫైసల్ చౌదరి ధ్రువీకరించినట్లుగా అక్కడి వార్తా పత్రిక డాన్ వెల్లడించింది. అవినీతి ఆరోపణల కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.


ఇమ్రాన్ ఖాన్ అరెస్టును (Imran Khan Arrest) హైకోర్టు తప్పుబట్టింది. అరెస్టు అనంతరం ఇస్లామాబాద్ పోలీసు చీఫ్, ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అడిషనల్ అటార్నీ జనరల్‌ను 15 నిమిషాలలోగా కోర్టు ముందు హాజరుకావాలని ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూక్‌ ఆదేశించారు. తాము ‘‘సంయమనం’’ ప్రదర్శిస్తున్నామని, ఇస్లామాబాద్ పోలీసు చీఫ్ కోర్టుకు హాజరుకాకపోతే తాను ప్రధానమంత్రిని ‘‘పిలిపిస్తానని’’ చీఫ్ జస్టిస్ హెచ్చరించారు. ‘‘ఇమ్రాన్‌ను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో కోర్టుకు వచ్చి చెప్పండి’’ అని జస్టిస్ ఫరూక్ అన్నారు.


ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టు గేటులోకి ప్రవేశించిన కొద్దిసేపటికే, పారామిలిటరీ బలగాలు, సాయుధ సిబ్బంది క్యారియర్లు అతనిని అనుసరించి లోనికి ప్రవేశించాయని అక్కడే ఉన్న రాయిటర్స్ ప్రతినిధి చెప్పారు. గేట్‌ను సాయుధ వాహనాలు అడ్డుకున్నాయని, భారీ భద్రతతో ఖాన్ ను కొద్దిసేపటికే అక్కడి నుంచి తరలించారని వెల్లడించారు. సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిపై ఇమ్రాన్ చేసిన ఆరోపణలను సైన్యం తిరస్కరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. వజీరాబాద్‌లో తనపై జరిగిన హత్యాయత్నంలో అధికారి ప్రమేయం ఉందని ఇమ్రాన్ ఆరోపించారు. 


పాకిస్థాన్ రేంజర్లు ఇస్లామాబాద్ హైకోర్టును చుట్టుముట్టారని, వారు ఇమ్రాన్ ను టార్చర్ పెడుతున్నారని పీటీఐ వైస్ ప్రెసిడెంట్ ఫవాద్ హుస్సేన్ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ కారును కూడా వారు చుట్టుముట్టారని ట్వీట్ లో పేర్కొన్నారు.


పీటీఐకి చెందిన నేత అజర్ మశ్వానీ స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్‌ను రేంజర్లు కోర్టులోపలి నుంచి ‘అపహరించారని’ ట్వీట్ చేశారు. దీంతో దేశమంతా నిరసనలు చేయాలని పార్టీ నేతలకు పీటీఐ పిలుపుఇచ్చింది. పీటీఐ మహిళా నేత ముసర్రత్ ఛీమా ఓ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘వారు ఇమ్రాన్ ఖాన్‌ను టార్చర్ చేస్తున్నారు. ఖాన్ సాబ్‌ను కొడుతున్నారు’’ అని మాట్లాడారు.






ఇస్లామాబాద్ పోలీసులు ట్విటర్‌లో స్పందిస్తూ.. రాజధాని నగరంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లుగా చెప్పారు. ఇమ్రాన్ ఖాన్‌ను తాము ఏ విధమైన టార్చర్ పెట్టడం లేదని, కేవలం ఇమ్రాన్ కారును చుట్టుముట్టామని స్పష్టం చేశారు.


ఇమ్రాన్‌ ఖాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు గతంలో చాలా సార్లు యత్నించారు. లాహోర్‌లోని జమాన్ పార్క్‌లోని ఆయన నివాసంపై పోలీసులు గతంలో దాడి కూడా చేశారు. అక్కడ మాజీ ప్రధానిని నిర్భంధించారు. అయినా ఇమ్రాన్ అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. తాజాగా మాజీ ప్రధానిని అవినీతి ఆరోపణలపై అరెస్టు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.