Top Headlines Today: 


నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్‌ పరీక్షల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం telugu.abplive.com , tsbie.cgg.gov.inలో చెక్‌ చేసుకోండి. 


నేటి నుంచి జగనన్నకు చెబుదాం.. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రెడీ అయ్యింది. ఇవాళ్టి నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ అందించటం ఈ కార్యక్రమం స్పెషాలిటీగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఇది మరో ప్రతిష్టాత్మక కార్యక్రంగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీని కోసం 1902 అనే హెల్ప్‌లైన్‌ నంబర్‌ను పెడుతున్నారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షలు చేశారు. జగనన్నకు చెబుదాం పేరులో ముఖ్యమంత్రి జగన్ పేరును కలపి నిర్వహించే కార్యక్రమం ద్వారా సీరియస్ నెస్ ను పెంచేందుకు ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంటనేది ఇప్పటికే జిల్లా స్థాయిలోని అధికారులకు కూడా స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చారు. 


హైదరాబాద్‌లో నీడ మాయం
హైదరాబాద్ ఈరోజు అద్భుతం ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం 12.12 గంటలకు రెండు నిమిషాల పాటు నీడ కనిపించదు. ఆ సమయంలో భాగ్యనగరంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయి. ఈరోజు ఎండలో 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడ కూడా రెండు నిమిషాల పాటు కనిపిందు. 12.12 నుంచి 12.14 వరకు మీరు ఈ విషయాన్ని గమనించవచ్చు. ఏడాదిలో రెండు సార్లు జీరో షాడో డే ఏర్పడుతుంది. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ అంటే ఈరోజ, ఆగస్టు 3వ తేదీన కూడా జీరో షాడో డే ఏర్పడుతుంది. సమయంలో మార్పులతో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఇలా నీడ మాయం అవుతుంది. 


నేటి నుంచి హాల్ టికెట్ల పంపిణీ
తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మే 16న నియామక పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష హాల్‌టికెట్లు మే 9 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ మే 8న ఒక ప్రకటలో తెలిపింది.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె తెలిపారు. అయితే చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయని.. వీలైనంత త్వరగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు లింకు అందుబాటులో ఉందని అనిత రామచంద్రన్ వెల్లడించారు.


కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం లింగాయత్, వొక్కలిగ వర్గాలకు ఈ రిజర్వేషన్లు కల్పిస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టి ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ రోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పు ఇవ్వవచ్చని పేర్కొంది. అయితే ముస్లిం రిజర్వేషన్ల రద్దు నిర్ణయంపై కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ బీజేపీ పెద్ద దుమారమే రేపింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: లుపిన్, అపోలో టైర్స్, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్, రేమండ్, నజారా టెక్. ఈ కంపెనీల షేర్లపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


ఆర్తీ ఇండస్ట్రీస్: 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఆర్తీ ఇండస్ట్రీస్ రూ. 149 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, కార్యకలాపాల ద్వారా రూ. 1,656 కోట్ల ఆదాయం వచ్చింది.


పిడిలైట్ ఇండస్ట్రీస్‌: 2022-23 చివరి త్రైమాసికంలో పిడిలైట్ ఇండస్ట్రీస్ రూ. 283 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, కార్యకలాపాల ద్వారా రూ. 2,689 కోట్ల ఆదాయం వచ్చింది.


మహానగర్ గ్యాస్: నాలుగో త్రైమాసికానికి మహానగర్ గ్యాస్ లాభం రూ. 268 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,610 కోట్లుగా ఉంది.


బిర్లాసాఫ్ట్: బిర్లాసాఫ్ట్ పుంజుకుంది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ. 16.3 కోట్ల నష్టం నుంచి కోలుకుని, 2023 మార్చి త్రైమాసికంలో రూ.112 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 1,226 కోట్ల ఆదాయం వచ్చింది.


కాన్సాయ్ నెరోలాక్: కన్సాయ్ నెరోలాక్ జనవరి-మార్చి కాలంలో రూ. 94 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,733 కోట్లుగా ఉంది.


కల్పతరు పవర్‌: 2023 మార్చి త్రైమాసికంలో కల్పతరు పవర్ నికర లాభం 46% పెరిగి రూ. 156 కోట్లకు చేరుకుంది. అదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 4,882 కోట్ల ఆదాయం వచ్చింది.


ఆంధ్ర పేపర్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆంధ్ర పేపర్ రూ. 154 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 590 కోట్లుగా ఉంది.


కార్బోరండమ్ యూనివర్సల్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో కార్బోరండమ్ యూనివర్సల్ నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ. 137 కోట్లకు చేరుకుంది.


VIP ఇండస్ట్రీస్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో VIP ఇండస్ట్రీస్ రూ. 4.3 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఈ త్రైమాసికంలో ఆదాయం రూ. 451 కోట్లుగా ఉంది.


అపోలో పైప్స్‌: నాలుగో త్రైమాసికంలో అపోలో పైప్స్ రూ. 15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఆదాయం రూ. 252 కోట్లుగా ఉంది.


ఐపీఎల్‌ 2023లో నేడు 


ఐపీఎల్‌ 2023లో మ్యాచ్‌లు చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్‌ కు ఎవరు వెళ్తారనే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. అందుకే ప్రతి మ్యాచ్ చాలా కీలకంగా మారింది. దీంతో ప్రతి జట్టు శాయశక్తుల పోరాడుతోంది. దీంతో ప్రతి మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా ఉంటున్నాయి. ఆఖరి బంతి వరకు టెన్షన్ పెట్టిస్తున్నాయి. అలాంటి మరో మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది. ఈ గ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.