School Study Improves Life Expectancy : బడికి వెళ్లి బాగా చదువుకుంటే ప్రయోజకుడివి అవుతావంటూ పిల్లలకు పెద్దలు చెబుతుంటారు. బడికి వెళితే ప్రయోజకుడివి కావడంతోపాటు ఆయుర్ధాయం కూడా పెరుగుతుందని ఇకపై చెప్పవచ్చు. ఎందుకంటే బడికి వెళ్లే పిల్లలతో పోలిస్తే బడికి దూరంగా ఉంటున్న పిల్లల్లో ఆయుర్ధాయం చాలా తక్కువగా ఉంటోంది. బడికి వెళ్లకపోతే మనిషి ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందంటూ ఒక పరిశోధనలో తేలింది. నార్వేయన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం 59 దేశాలకు నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 


13 శాతం మరణాల రేటు తక్కువ


నిర్లక్ష్యరాసులతో పోలిస్తే స్కూల్‌కు వెళ్లి చదువుకునే ప్రైమరీ స్కూల్‌ పాస్‌ అయిన వారిలో మరణాలు రేటు 13 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. సెకండరీ స్కూల్‌ పాస్‌ అయితే మరణాల రేటు 25 శాతం తక్కువగా ఉంటోంది. అదే స్కూల్‌కు వెళ్లని చిన్నారుల్లో ఈ మరణాలు రేటు అధికంగా ఉంటోంది. స్కూల్‌కు వెళ్లని మనిషి ఆరోగ్యంపై రోజుకు ఐదు నుంచి ఆరు పెగ్లులు మద్యం తాగినంత, పది సిగరెట్లను పదేళ్లపాటు తాగినంత ప్రభావం చూపిస్తున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. విద్య వల్ల కేవలం మనిషి జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా మనిషి ఆయుర్ధాయాన్ని కూడా పెంచుతున్నట్టు పరిశోధనలో నిర్ధారణ అయింది. 


పరిశోధన ప్రక్రియ సాగిందిలా


పరిశోధన బృందం కీలక అంశాలపై సుదీర్ఘకాలంపాటు పరిశోధించి ఫలితాలను వెల్లడించింది. రోజూ బడికి/కాలేజీకి వెళ్లి చదువుకోవడం, చిన్నతనంలోనే బడి మానేయడం/పూర్తిగా బడికి వెళ్లకపోవడం.. ఈ రెండు సందర్భాల్లో మనిషి మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎలా ప్రభావం పడుతుందో విశ్లేషించారు. ఒక వ్యక్తి స్కూల్‌/కాలేజీకి వెళ్లే ప్రతి ఏడాది అతని ఆయుర్ధాయం రెండేళ్లు పెరుగుతుందని విశ్లేషించారు. అంటే, 18 ఏళ్లపాటు ఒక వ్యక్తి విద్యా సంస్థకు వెళ్లి చదువుకుంటే అతని ఆయుర్ధాయం నిరక్షరాస్యులతో పోలిస్తే 34 శాతం ఎక్కువగా ఉంటున్నట్టు తేల్చారు. ఈ అధ్యయనాన్ని లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురించారు. చదువు మనిషి ఆర్థిక, మేధో ప్రగతికి, సమాజంలో ఉన్నతమైన జీవనానికి దోహదం చేయడంతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్న విషయం పరిశోధన పూర్వకంగా బహిర్గతం కావడం హర్షనీయమనే చెప్పాలి. ఈ విషయాన్ని మరింత మందికి చేరువ చేయడం ద్వారా ఆర్థిక అంశాలు, ఇతర కారణాలతో పిల్లలను చదువుకు దూరంగా ఉంచే వారి సంఖ్యను తగ్గించేందుకు అవకాశముంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.