Maldives Political Crisis: మాల్దీవ్స్ అధ్యక్షుడి మహమ్మద్ ముయిజూని పదవీ గండం (President Mohamed Muizzu) చుట్టుకుంది. ప్రతిపక్ష పార్టీ Maldivian Democratic Party  ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్‌లో మెజార్టీ సీట్లున్న MDP అభిశంసన తీర్మానంపై సంతకాల సేకరణ మొదలు పెట్టింది. అవసరానికి మించి చైనాకి దగ్గరవుతున్నారని ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. దీనికి తోడు ఈ మధ్య చైనాకి చెందిన ఓ స్పై షిప్‌ మాల్దీవ్స్‌కి (China Spy Ship) వచ్చేందుకు అధ్యక్షుడు ముయిజూ అనుమతినిచ్చారు. ఇది ఈ అసహనాన్ని మరింత పెంచింది. పార్లమెంట్‌లో దీనిపై ఘర్షణ కూడా జరిగింది. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ప్రతిపక్ష పార్టీ ఎంపీలు వ్యతిరేకించారు. ఓటును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎండీపీ పార్టీ ఎంపీ ఇసాపై అధికార పీఎన్‌సీ పార్టీ ఎంపీ షహీమ్‌ దాడికి పాల్పడ్డారు.  కాళ్లు పట్టుకుని కిందపై పడేశారు. దీంతో షహీమ్‌పై ఇసా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామంతో పార్లమెంట్‌లో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఇసా దాడిలో షహీమ్‌ తీవ్రంగా గాయపడడంతో...ఆస్పత్రికి తరలించారు. అనంతరం పార్లమెంట్‌లో చర్చ జరిగింది. 






కొద్ది రోజులుగా భారత్, మాల్దీవ్స్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తరవాత ఇవి మొదలయ్యాయి. మాల్దీవ్స్ మంత్రులు కొందరు ప్రధాని మోదీపై నోరు పారేసుకున్నారు. ఫలితంగా చాలా మంది Boycottmaldives అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. చాలా మంది మాల్దీవ్స్‌ ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరవాత ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ చైనాలో పర్యటించారు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటన తరవాత ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా భారత్‌నే ఉద్దేశించి ఉండడం ఇంకాస్త ఆగ్రహాన్ని పెంచింది. తమది చిన్న దేశమే అన్న చిన్న చూపు చూడొద్దని, అలాంటి కవ్వించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. అయితే...భారత్‌ పేరు ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే పరోక్షంగా భారత్‌ గురించే ఈ కామెంట్స్ చేశారన్న చర్చ గట్టిగానే జరుగుతోంది. 


"మాది చూడడానికి చిన్న దేశమే కావచ్చు. అలా అని మమ్మల్ని కవ్వించే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ చిన్న చూపు చూడాల్సిన పని లేదు. మా దేశాన్ని మేము అతి పెద్ద ఎకనామిక్‌ జోన్‌గా చూస్తున్నాం. మా చుట్టూ ఉన్న సముద్రం మాదే. అది వేరే ఏ దేశానికీ చెందినది కాదు. మేం ఎవరి దగ్గరా చేయి చాచడం లేదు. మాకు ఎవరి అండా అవసరం లేదు. మాదో స్వతంత్ర ప్రాంతం"


- మహమ్మద్ ముయిజూ, మాల్దీవ్స్ అధ్యక్షుడు


Also Read: అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా వల్ల కావడం లేదు - కోటాలో విద్యార్థిని ఆత్మహత్య