Kota Student Suicide: రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. 18 ఏళ్ల నిహారికా సింగ్ JEE ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతోంది. ఎగ్జామ్‌లో పాస్ అవుతానో లేదోనన్న ఒత్తిడితో ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. ఈ జనవరిలోనే ఇది రెండో ఆత్మహత్య. ఫ్యాన్‌కి వేలాడుతున్న కూతురుని చూసి తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆత్మహత్యకు గల కారణాలేంటో ఆరా తీశారు. నిహారికా మృతదేహంతో పాటు సూసైడ్‌ లెటర్‌ని స్వాధీనం చేసుకున్నారు. తాను JEE ఎగ్జామ్‌కి ప్రిపేర్‌ అవ్వలేకపోతున్నానని, అమ్మా, నాన్నా..సారీ అని అందులో రాసింది. ఇంతకు మించి వేరే మార్గం ఏదీ కనిపించడం లేదని రాసి సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


"అమ్మా..నాన్నా...ఈ JEE ఎగ్జామ్ రాయడం నా వల్ల కాదు. అందుకే చనిపోవాలనుకుంటున్నా. నేనో లూజర్‌ని. నేను మంచి కూతురుని అనిపించుకోలేకపోతున్నాను. నన్ను క్షమించండి. నాకు ఇంతకు మించి వేరే దారి కనిపించడం లేదు"


- సూసైడ్ లెటర్‌ 



నిహారికా తండ్రి బ్యాంక్ ఎంప్లాయ్. కొద్ది రోజులుగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతోంది. రోజుకి 7-8 గంటల పాటు చదువుతోంది. ఇదే ఆమెని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. కోటాలోనే కోచింగ్ తీసుకుంటున్న మహమ్మద్ జాయిద్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న జాయిద్...ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతేడాది కోటాలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై మార్గదర్శకాలు జారీ చేసింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలని ఆదేశించింది.


వినియోగదారుల రక్షణ చట్టం-2019లోని నిబంధనలకు విరుద్ధంగా వస్తువులు, సేవలకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనలను ఎవరూ జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ సంస్థలన్నింటికీ మార్గదర్శకాలు, వినియోగదారుల చట్టం వర్తిస్తుందని పేర్కొంది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతో పాటు వారికి సరైన సౌకర్యాలు కల్పించడం, బోధనా విధానాలు మెరుగుపరచడం, అధిక రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు వీటిని రూపొందించినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా శిక్షణ కేంద్రాలకు పలు సూచనలు చేసింది. 


➥ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు చాలినంత స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి. 


➥ శిక్షణ కేంద్రాల్లో అర్హులైన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసుండాలి. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా.. ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. 


➥ శిక్షణ సంస్థలు తమ ప్రకటనల్లో చిన్న ఫాంట్‌లో స్పష్టంగా కనిపించనివిధంగా కొంత సమాచారం ఇస్తుంటారు. ఇకముందు దాన్ని కూడా పెద్ద ఫాంట్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది.


Also Read: Budget 2024: గత వ్యవసాయ బడ్జెట్‌లోని ప్రధానాంశాలు ఇవి, ఓ లుక్కేయండి