గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం కరాచీలోని  ఘాజీ షా పీర్ మజార్ సమీపంలో నివసించేవాడని తాజాగా బయటపడింది. చోటా షకీల్ అతడి వద్ద పని చేసేవాడని ఛోటా షకీల్ బావ, ముఠా సభ్యుడు సలీమ్‌ బహిర్గతం చేసినట్టు ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో చాలా విషయాలు సలీమ్‌ పేర్కొన్నట్టు తెలుస్తోంది. 


దావూద్‌పై ఉన్న మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ... అతనికి సంబందించిన చాలా మంది సహాయకులను ప్రశ్నించింది. అలా ప్రశ్నించిన సందర్భంలో ఛోటా షకీల్ కరాచీలో ఉన్నాడని సలీం వెల్లడించాడని ఏఎన్‌ఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో సలీంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఏజెన్సీ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.






దావూద్ ఇబ్రహీం, అతని సహచరులు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం, మత సామరస్యానికి భంగం కలిగించే కుట్రలకు ప్లాన్ చేశారని ఆరోపిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 


సలీం ఖురేషీ ఉరఫ్‌ సలీమ్ ఫ్రూట్ అనేక సార్లు పాకిస్థాన్‌కు వెళ్లి ముంబైలో దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ కోసం పనిచేస్తున్నట్లు ఏజెన్సీ అనుమానిస్తోంది. అతని బ్యాంకు ఖాతాలు, ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఈడీ సేకరించింది.


దావూద్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసుపై ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 70 మంది ఈడీ అధికారులు దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్, ఛోటా షకీల్ బావ సలీం ఖురేషీ, దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడి నివాసాలతోపాటు 10 ప్రాంతాల్లో సోదాలు చేశారని PTI పేర్కొంది. 


పీటీఐ చెప్పినట్టుగా ఈ వ్యక్తులు మాదకద్రవ్యాల రవాణా, దోపిడీ, ముంబైలోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తి అమ్మకం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా పొందిన అక్రమ డబ్బును డిపాజిట్ చేసినట్లు ED అనుమానిస్తోంది. ఈ డబ్బును ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఏజెన్సీ అభిప్రాయపడుతోంది.