• హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం

  • సాంకేతిక సహా పలు రంగాల్లో పెట్టుబడులకు సీఎం జగన్ ఆహ్వానం 

  • ఏపీలో రూ.250 కోట్లతో బయో ఇథనాల్‌ ప్లాంట్‌‌కు అసాగో సై

  • ఏపీలో షిప్పింగ్, లాజిస్టిక్‌ వ్యాపారంలోకి మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ 


దావోస్‌ : ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఏపీ పెవిలియన్‌లో టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని భేటీ (CM Jagan Meets Tech Mahindra CEO Gurnani ) అయ్యారు. విశాఖపట్నంలో టెక్‌ మహీంద్ర కార్యకలాపాల విస్తరణపై సమావేశంలో చర్చించారు. హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడంతో తాము భాగస్వామి అవుతామని టెక్ మహీంద్రా సంస్థ ప్రకటించింది.


రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికోసం ఒక స్కిల్‌ యూనివర్శిటీతోపాటు, 30 స్కిల్‌కాలేజీలు, వీటికి అదనంగా మరో 175 స్కిల్‌ హబ్స్‌ ఏర్పాటుచేస్తున్నామని  సీఎం జగన్ తెలిపారు. ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి వీటితో అనుసంధానం కావాలని సీఎం కోరారు. విద్యార్థులకు మరింత నైపుణ్యం వచ్చేందుకు వీలుగా ఇంటర్న్‌షిఫ్, అప్రెంటిషిప్‌ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్రంలో ఇథనాల్‌ తయారీకి రూ.250 కోట్ల పెట్టుబడితో ప్లాంటు పెడతామని మహీంద్రా అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతిపాదించింది. అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. 






మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ.. 
ముఖ్యమంత్రి జగన్ తో మంచి సమావేశం జరిగిందని టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాని అన్నారు. విశాఖపట్నంను మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని వైఎస్ జగన్ కోరారు. ఆర్టిఫియల్‌ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని సీఎం సంకల్పంతో ఉన్నారు. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని మమ్మల్ని ఆహ్వానించారు.
సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు ఆంధ్రా వర్శిటీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని గుర్నానీ పేర్కొన్నారు.


విద్యారంగంలో ‘దస్సాల్‌’ పెట్టుబడులు
త్రీడీ సంబంధిత ఉత్పత్తులను అందిస్తున్న ఫ్రెంచ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఆ కంపెనీకి 140 దేశాల్లో 20వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. విద్యా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్ ఆసక్తి చూపింది. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంపై చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు అందించడానికి సైన్స్‌ బేస్డ్‌ టార్గెట్స్‌ ఇనీషియేటివ్‌లో భాగంగా హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీలో భాగస్వామ్యం కావాలని సీఎం జగన్ కోరారు. పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా తగిన సహకారం అందించాలన్నారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలత తెలిపిన దస్సాల్ట్‌ సిస్టమ్స్‌.. త్వరలో ఏపీలో పర్యటిస్తామని ఫ్లోరెన్స్‌ వెల్లడించారు.






దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్‌తో సమావేశంలో నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై చర్చ జరిగింది. స్మార్ట్‌ పోర్టులు, కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించాం. చర్చలు ఫలప్రదంగా సాగాయి. విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాం. ఏపీతో భాగస్వామ్యానికి దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎదురుచూస్తోందన్నారు.


అనంతరం స్విస్‌ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం వైఎస్ జగన్‌ భేటీ అయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్‌ ఎంపీ నిక్లాజ్‌ శామ్యూల్‌ గుగెర్‌ బృందంతో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. 


ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, సీఈఓతో జగన్ భేటీ 
ఏపీ పెవిలియన్‌లో మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటోతో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు.  ప్రపంచంలోనే ఓడల ద్వారా అత్యధిక మొత్తంలో సరుకు రవాణా చేస్తున్న కంపెనీ ఇది. టోక్యో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ వార్షిక ఆదాయం దాదాపుగా 10.3 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులను పూర్తిచేసి తద్వారా ఏడాదికి 507 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వివరించారు. కంటైనర్‌ హబ్, లాజిస్టిక్‌ రంగాలపై దృష్టిపెట్టాలని సీఎం కోరారు. వైఎస్ జగన్ ప్రతిపాదనపై హషిమొటో సానుకూలత వ్యక్తం చేసింది. కాకినాడలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకొస్తున్నామని వెల్లడించింది.


షిప్పింగ్, లాజిస్టిక్స్‌ వ్యాపార రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అవకాశాలపై చర్చించామని ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటో తెలిపారు. ఏపీకి గొప్ప అవకాశాలున్నాయని. మేం కూడా మా వ్యాపారాన్ని విస్తరించడానికి మాకు అవకాశం కలుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేం భారత్‌లో పూర్తిస్థాయి కంపెనీని పెట్టాం, ఏపీలో ఈ కంపెనీద్వారా మా వ్యాపారాన్ని విస్తరిస్తామన్నారు. ఏపీకి పొడవైన తీరప్రాంతం ఉంది. కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా ఈ రంగంలో వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయని ఆకాంక్షించారు.


హీరో గ్రూప్‌ ఛైర్మన్, ఏపీ సీఎం భేటీ
హీరో గ్రూప్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజల్‌, ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై చర్చించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తిచేస్తున్న అథెర్‌ ఎనర్జీలో ఇప్పటికే 36శాతం వాటాను కొనుగోలుచేసిన హీరో గ్రూప్‌. బ్యాటరీ టెక్నాలజీలో తైవాన్‌కు చెందిన  గగొరో కంపెనీతో హీరో గ్రూప్‌కు భాగసామ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌లో భాగంగా పరిశ్రమలకు నీటివనరులను అందించే పనుల్లో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి అవసరమైన నీటిని కండలేరు నుంచి ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.


Also Read: KTR Jagan Meet: దావోస్‌లో అరుదైన కలయిక, ఒకే ఫ్రేములో డైనమిక్ లీడర్స్ - ‘అక్కడా ఏపీ పరువు తీస్తున్నారా’ అని నెటిజన్ల ఫైర్!