తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్న రాజకీయ నాయకులు ఇద్దరూ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా కలుసుకున్నారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాగా, మరొకరు తెలంగాణ ఐటీ మంత్రి కే తారక రామారావు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడం కోసం దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వేర్వేరుగా హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులను కలుస్తూ పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరిస్తున్నారు.


ఈ క్రమంలోనే సోమవారం ఇద్దరూ సదస్సులోనే కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇందులో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నట్లుగా ఉంది. ‘‘నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌‌తో గొప్ప సమావేశం జరిగింది’’ అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. వీళ్లు ఇద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.






అయితే, కేటీఆర్ ట్వీట్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. కొందరు మాత్రం వినూత్నంగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ మధ్య కేటీఆర్ హైదరాబాద్‌లో జరిగిన క్రెడాయ్ సదస్సులో మాట్లాడుతూ.. ఏపీలో కరెంటు కోతలను, రోడ్ల దుస్థితిని పరోక్షంగా గుర్తు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఏపీలో ప్రస్తుతం కరెంటు కోతలు, రోడ్ల నాణ్యత దెబ్బతిన్నప్పటికీ కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తమదైన శైలిలో ఖండించారు. అప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కామెంట్ల రూపంలో పెడుతున్నారు. ‘‘ఈ డైలాగ్‌ అక్కడ కూడా చెప్పి ఏపీ పరువు అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారా ఏంటి?’’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.






‘‘అంత గొప్పగా ఏమి మాట్లాడారు దొర!! మీరు గతంలో చెప్పినట్లు రోడ్ల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో కరెంట్ కోతల గురించి మాట్లాడారా, భూ ముల విలువల గురించి మాట్లాడారా..? లేక మా రాష్ట్రాన్ని ఇంకా ఎంత నాశనం చేయచ్చో ట్రైనిగ్ ఇచ్చావా మీ అన్నకు..’’ అంటూ  మరో నెటిజన్ కామెంట్ రాసుకొచ్చాడు.






దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో తమ ప్రభుత్వం తీసుకున్న విధానాల గురించి ప్రస్తావించారు. మంత్రి కేటీఆర్ కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.