Australia Plane Crash Today: వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ఇటీవల సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం గాలిలో ఊగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలో మరో ఘటన జరిగింది. ఇళ్లు, భవనాల మీదుగా ఎగురుకుంటూ వెళ్లిన తేలికపాటి విమానం రన్‌వేపై కూలిపోయింది. అదృష్టవశాత్తూ పైలట్, ప్రయాణికుడు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.


ఏబీసీ నివేదిక మేరకు.. సెస్నా 210 అనే పేరుతున్న తేలికపాటి విమానం ఇంజిన్ ఫెయిల్ అయ్యి నియంత్రణ కోల్పోయింది. భవనాలు, చెట్లను తప్పించుకుంటూ సిడ్నీలోని బ్యాంక్‌స్టౌన్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న పైలట్ జేక్ స్వాన్‌పోయెల్, అతని భాగస్వామి ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. విమానం కూలిపోతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. వీడియోలో సెస్నా 210 విమానం అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చి రన్‌వేపై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. దాదాపు 150 మీటర్లు జారుకుంటూ వెళ్లి గడ్డి ఉన్న ప్రాంతంలో ఆగిపోయింది. ఆ తరువాత అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటకు రావడం గమనించవచ్చు.






ఘటనపై పైలెట్ జేక్ స్వాన్‌పోయెల్ స్పందిస్తూ.. దాదాపు 30 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నట్లు చెప్పారు.  ఇంజిన్ ఫెయిల్ అవడంతో భయాందోళనకు గురయ్యానని, చాలా చోట్ల తమ విమానం చెట్లను తగులుతూ వచ్చిందని వివరించాడు. అతని భాగస్వామి కరీన్ స్పందిస్తూ.. ఘటనను తలుచుకున్నప్పుడు భయంతో వణికిపోయామని, నగరంలోని నివసాలపై ఎక్కడ కూలుతుందోనని భయపడ్డామని చెప్పొకొచ్చారు. రన్‌వే పైకి చేరతామో లేదో ప్రాణాలతో ఉంటామో లేదోననే భయపడ్డామని చెప్పారు. 


ఏబీసీ నివేదిక ప్రకారం.. విమానం గాలిలో ఉన్నప్పుడు మే డే మే డే ఇంజిన్ ప్రాబ్లెం అంటూ విమానంలోని రేడియో ద్వారా సమాచారం అందించారు. వేగంగా స్పందించిన టవర్ కంట్రోలర్.. అన్ని రన్‌వేలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన విధంగా ల్యాండింగ్ చేయాలని సమాధానం ఇచ్చారు. రన్‌వే పై ఎటువంటి అడ్డకుంలు లేకోవడంతో విమానం క్రాష్ ల్యాండింగ్ జరిగినా ప్రాణ నష్టం లేదని ఏబీసీ అధికారులు తెలిపారు. ఘటనపై ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో దర్యాప్తు చేపట్టింది.


గాలిలో ఊగిపోయిన విమానం
ఇటీవల సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-300ER విమానం లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తూ గాలిలో తీవ్రమైన కుదుపులకు గురైంది. ఆకాశంలో 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం మూడు నిమిషాల వ్యవధిలో 6,000 అడుగులు పడిపోయి 31,000 ఎత్తులో ప్రయాణించింది. దాదాపు 10 నిమిషాల పాటు విమానం 31,000 అడుగుల ఎత్తులో ప్రయాణించింది. ఆ సమయంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో కలిసి మొత్తం 229 మందితో విమానంలో ఉన్నారు. దీంతో విమానాన్ని బ్యాంకాక్‌ మల్లించి సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మరణించగా.. సుమారు 30 మంది గాయపడ్డారు.