2 Thousand People Died Due To Landslide In Papua New Guinea: నైరుతి పసిఫిక్‌లోని ద్వీపదేశమైన పావువా న్యూ గునియాలో ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో దాదాపు 2 వేల మంది సజీవ సమాధి అయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్.. ఐరాసకు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖ రాసింది. 'కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2 వేల మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు. వేల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. ఆహార పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ఈ విపత్తు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది' అని ఐరాస్ కార్యాలయానికి సమాచారం అందించింది. అయితే, దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించగా.. కొన్నిచోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్లు తెలుస్తోంది.
సహాయక చర్యలు ముమ్మరం
విపత్తుతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడేందుకు బృందాలు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో మృతదేహాలను గుర్తించారు. ఇప్పటికీ చాలా చోట్ల కొండ చరియలు విరిగి పడుతుండడంతో సహాయక బృందాలకు సవాల్‌గా మారింది. సైన్యం, ఇతర బృందాలను సైతం సహాయక చర్యల కోసం సిద్ధం చేస్తున్నారు. అటు, మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్ సెంటర్ ద్వారా సమన్వయం చేసుకుంటామని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
పెను విపత్తు
పాపువా న్యూ గునియాలోని రాజధాని పోర్ట్ మోర్స్‌బీకి 600 కిలోమీటర్ల దూరం ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంలో ఈ నెల 24న (శుక్రవారం) తెల్లవారుజామున మౌంట్ ముంగాల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో ఆ ప్రావిన్స్ లో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని అక్కడి ప్రభుత్వం భావించగా.. అనంతరం భారీ విపత్తు జరిగినట్లు గుర్తించింది. భారీ భవనాలు, పంటలు కూడా శిథిలాల కింద చిక్కుకున్నట్లు తేలింది. ఈ ప్రమాదంలో దాదాపు 150 ఇళ్లు ధ్వంసయ్యాయని లెక్క తేలింది. అంతకు ముందు 60 ఇళ్లు ఇలాగే మట్టిలో కూరుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు. తొలుత 670 మంది మట్టిలో కూరుకుపోయి చనిపోయినట్లు అంచనా వేయగా.. అనంతరం మృతుల సంఖ్య వేలకు చేరింది. ఇప్పటివరకూ 2 వేల మంది సజీవ సమాధి అయ్యారని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. విపత్తు సంభవించిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఎక్కడికక్కడ మట్టి పోగవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్స్‌కి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక్కో చోట 20 - 26 అడుగుల లోతులో కూరుకుపోయిన బాధితులను చాలా శ్రమించి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అటు, పోర్గెర మైన్‌కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతినగా.. రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం పలుచోట్ల సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది.
Also Read: Gaza: ఇజ్రాయేల్‌పై బిగ్ మిజైల్‌ని ప్రయోగించిన హమాస్, ఉలిక్కిపడ్డ టెల్ అవీవ్ - యుద్ధం మరింత తీవ్రం!