Maldives Tourism News: మాల్దీవులతో భారత్ స్వేచ్ఛాపూరిత వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోందని మాల్దీవుల మంత్రి మహ్మద్ సయీద్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. కొన్నాళ్ల కిందట లక్ష్యద్వీప్‌కు భారత్ ప్రధాని మోదీ వెళ్లిన తరువాత.. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. అనంతరం ఇరు దేశాల మధ్య అగాదం ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని లక్ష్య ద్వీప్ పర్యటనకు వెళ్లి వచ్చిన తరువాత.. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది.
మాల్దీవుల ఆదాయంలో పర్యాటక రంగానిదే అగ్రభాగం కాగా, ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నుంచి వెళ్లే సందర్శకుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రధాని లక్ష్యద్వీప్‌ను సందర్శించాలని కోరడం, ఆ తరువాత మాల్దీవులు మంత్రులు వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆర్థికంగా మాల్దీవులు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మాల్దీవులు మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మాల్దీవులతో భారత్ స్వేచ్ఛాపూరిత వాణిజ్య ఒప్పందానికి ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి సయీద్ పేర్కొన్నారు. వీలైనన్ని ఎక్కువ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని మాల్దీవులు కోరుకుంటోందన్న మాలేలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని మాల్దీవులు వాణిజ్య, ఆర్థికాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్న సయీద్ పేర్కొన్నారు. దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎస్‌ఏఎఫ్‌టీఏ)తోపాటు మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఉండాలని భారత్ కోరుకుంటోందని మమ్మద్ సయీద్ చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అవకాశం
మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునే అవకాశాన్ని అధ్యక్షుడు మమ్మద్ ముయిజ్జు కల్పించారని మంత్రి పేర్కొన్నారు. వాణిజ్య కార్యకలాపాలలో సౌలభ్యాన్ని ఆస్వాదించడానికి వీలైనన్ని ఎక్కువ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భారత్, మాల్దీవుల మధ్య వాణిజ్య ఒప్పందం వల్ల నిత్యావసర సరుకులు ఎగుమతిని సులభతరం చేస్తుందన్నారు. భారత్, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో తొలిసారి 300 మిలియన్లను అధిగమించిందన్న మంత్రి.. ఆ తరువాత ఏడాది 500 మిలియన్లను అధిగమించిందన్నారు. దౌత్యపరమైన వివాదాలు ఉన్నప్పటికీ.. మాల్దీవుల ప్రత్యేక అభ్యర్థనపై భారత్ మరో ఏడాదికి 50 మిలియన్ల ట్రెజరీ బిల్లును మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.