Elon Musk And Vivek Ramaswamy: రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు ఇచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను జనవరిలో చేపట్టనున్నారు. ఈ లోపు తన టీమ్‌ను బిల్డ్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా మస్క్, రామస్వామికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇది "ప్రభుత్వానికి వెలుపల నుంచి సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తుంది" అని ట్రంప్ అన్నారు.
"ఎలోన్ మస్క్ అండ్ వివేక్ ఇద్దరూ అద్భుతమైన అమెరికన్లు, ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించడంలో, అనవసరమైన చట్టాలు, రూల్స్ సరిచేయడానికి, వృథా ఖర్చులు తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణానికి నాకు మార్గం సుగమం చేస్తారు" అని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు.
"ఎలోన్, వివేక్ సమర్థతను దృష్టిలో ఉంచుకుని ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు చేయాలని చూస్తున్నాను. అదే సమయంలో అమెరికన్లందరి జీవితాన్ని మెరుగుపరుస్తాం" అన్నారాయన. ప్రభుత్వంలో ఉన్న వేస్టేజ్‌ను తీసేస్తామన్నారు ట్రంప్.
ట్రంప్ విజయంలో మస్క్ పాత్ర చాలా కీలకమైంది. అందుకే మస్క్‌ను ఉద్దేశించి ట్రంప్ తన విజయం తర్వాత మాట్లాడుతూ “రాజకీయాల్లో కొత్త స్టార్ పుట్టింది. మస్క్ చాలా మంది ప్రాణాలు కాపాడారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి, సూపర్ మేధావి. మన మేధావులను మనం రక్షించుకోవాలి" అని చెప్పారు.
"తెలుసా, ఆయన రెండు వారాలు ఫిలడెల్ఫియాలో, పెన్సిల్వేనియాలోని వివిధ ప్రాంతాల్లో, ప్రచారంలో ట్రావెల్ చేశారు. ఎలన్‌కు మాత్రమే ఇది సాధ్యం." అని SpaceX లాంచ్‌ను చూసి కామెంట్ చేశారు. "అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎలోన్," అని చెప్పారు.
ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి నాయకత్వం వహించనున్న విభాగానికి డీవోజీఈ అని పేరు పెట్టారు. క్రిప్టోకరెన్సీ డాగ్‌కాయిన్ తరహాలో దీనికి ఆ పేరు పెట్టారు. ఎన్నికల వేళ ట్రంప్‌కు వందల మిలియన్ల డాలర్లు మస్క్ ఇచ్చారు. ఆయన విజయం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష ఎన్నిక కోసం ట్రంప్‌తో రామస్వామి పోటీ పడ్డారు. తర్వాత ఇద్దరూ ఒక్కటై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఫాక్స్ న్యూస్ హోస్ట్ పీట్ హెగ్‌సెత్‌కు రక్షణ శాఖ అప్పగించారు. జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను ట్రంప్ ఎంపిక చేశారు.
మరోవైపు ప్రత్యర్థులు ఓడిపోయినప్పటికీ విమర్శల దాడి మాత్రం ట్రంప్ మద్దతు దారులు ఆపడం లేదు. జో బైడెన్ పదవీకాలంపై ఎలోన్ మస్క్ ప్రశ్నలు సంధించారు. మస్క్ ఎవరి పేరు చెప్పనప్పటికీ, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నారు.Xలో వీడియో షేర్ చేసిన ఎలోన్ మస్క్... రష్యా-ఉక్రెయిన్ వివాదంలో అమెరికా పోషించిన పాత్ర ఎత్తి చూపారు. ఉక్రెయిన్ యుద్ధం మూలాల గురించి వాదిస్తున్న అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ డి సాచ్స్ వీడియోలో కనిపిస్తున్నారు. ఇది రష్యా నుంచి వచ్చిన దురాక్రమణ మాత్రమే కాదని, పొరుగు దేశాల మధ్య సంఘర్షణను ప్రారంభించిన US నేతృత్వంలోని NATO విస్తరణ అని సాచ్స్ పేర్కొన్నారు.
Also Read: రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం ట్రంప్‌కి సాధ్యమేనా?