రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం ట్రంప్‌కి సాధ్యమేనా?
ఓ ఇంట్లో పంచాయితీ వస్తే పెద్ద వాళ్లు వచ్చి సర్ది చెప్తారు. ఏదో విధంగా ఆ గొడవని సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే విధంగా...దేశాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు...అమెరికా నేనున్నాంటూ వచ్చేస్తుంది. ఆ పంచాయితీని తేల్చేస్తామని ముందుకొస్తుంది. రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక అమెరికా రెండు వర్గాలనూ కూర్చోబెట్టి మాట్లాడించేందుకు చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. ఇదంతా బైడెన్ వైఫల్యమే అని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తేల్చి చెబుతున్నారు. "నేనొచ్చాక..ఇంతా సెటిల్ అయిపోతుంది" చాలా కాన్ఫిడెంట్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయన సపోర్టర్స్ అయితే...ట్రంప్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోతుందని చెబుతున్నారు. అప్పటి నుంచి దీనిపై అంతర్జాతీయ స్థాయిలో డిబేట్ జరుగుతోంది.
ట్రంప్ గెలిచిన వెంటనే...రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చంపాలని చూసినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేసి గెలిచారని ప్రశంసించారు. ఈ చొరవతోనే...ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యని అడ్డుకునేలా ట్రంప్..పుతిన్‌ని కన్విన్స్ చేస్తారన్నది ఓ అంచనా. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఆ స్థాయిలో యూరప్‌లో విధ్వంసం జరిగింది...రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల. పైగా ఈ యుద్ధం కారణంగా వరల్డ్ ట్రేడ్‌పైనా ఎఫెక్ట్ పడుతోంది. చాలా చోట్ల చమురు సరఫరా ఆగిపోతోంది. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బ తింటోంది. ఇదే విషయమై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాతో పాటు ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కి పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాయి. కానీ..ఇలా ఎన్ని రోజులు..? అని తమని తాము ప్రశ్నించుకుంటున్నాయి. ఎప్పుడో అప్పుడు...దీనికి ఫుల్ స్టాప్ పడకపోతే కష్టమే అని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే ట్రంప్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆసక్తికరంగా మారింది.