Easyjet Airlines:
ఈజీజెట్‌లో వింత అనుభవం..
బ్రిటన్‌లోని Easyjet ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్స్‌కి చుక్కలు చూపించింది. తక్కువ ధరకే సర్వీస్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ..తరచూ ఏదో ఓ టెక్నికల్ సమస్యతో ఇబ్బందులు పెడుతోంది. ఈసారి ఏకంగా టేకాఫ్ అయ్యే ముందు 19 మంది ప్రయాణికులను బలవంతంగా కిందకు దింపేసింది. ఎందుకిలా అని అడిగితే "బరువు ఎక్కువైపోయింది. అందుకే దింపేశాం" అని వింత సమాధానం చెప్పింది. స్పెయిన్ నుంచి బ్రిటన్‌కు వస్తున్న 19 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లోనే దింపేసి వెళ్లిపోయింది. అప్పటికే వాతావరణం సరిగ్గా లేక డిలే అయింది. దీనికి తోడు టేకాఫ్‌కి సమయం పట్టింది. ఫ్లైట్‌లో బరువు పెరిగిపోయిందని, కొందరు దిగిపోవాల్సి ఉంటుందని పైలట్ అనౌన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వాతావరణ సరిగ్గా లేనందున ఫ్లైట్ డిలే అవుతుందని చెప్పాడు.
"మీరందరూ మా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించడం చాలా సంతోషం. కానీ మీ సంఖ్య ఎక్కువ అవడం వల్ల ఫ్లైట్ బరువు పెరిగిపోయింది. టేకాఫ్‌కి అనుకూల పరిస్థితులు లేవు. మా సీనియర్ ఆఫీసర్‌తో ఇప్పటికే మాట్లాడాను. గతంలోనూ ఇలాంటి పరిస్థితులే మాకు ఎదురయ్యాయి. మీ సేఫ్‌టీ మా బాధ్యత. ఇలాంటి కండీషన్‌లో ఫ్లైట్‌ని టేకాఫ్ చేయడం మంచిది కాదు. ఎయిర్ క్రాఫ్ట్‌లో బరువు తగ్గితే కానీ టేకాఫ్ చేయలేమని మా సీనియర్స్ చెప్పారు. కనీసం 20 మంది ప్రయాణికులు ఫ్లైట్ దిగిపోవాలని కోరుకుంటున్నాను. అలా దిగిపోయిన వారికి ఇన్సెంటివ్ ఇస్తాం"
- ఈజీజెట్ పైలట్
ఇన్సెంటివ్స్ ఇస్తే సరిపోతుందా మాకు ఇష్టం ఉండాలిగా అని చాలా మంది ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఎలాగోలా ఓ 19 మంది దిగిపోయారు. వాళ్లందరికీ క్షమాపణలు చెప్పిన ఎయిర్‌లైన్స్ తరవాతి ఫ్లైట్‌కి అందరినీ పంపించింది. ప్రస్తుతానికి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: UCC అమలు చేయడం ఆర్టికల్ 370 రద్దు చేసినంత సింపుల్ కాదు - గులాం నబీ ఆజాద్