Uniform Civil Code:
యూసీసీపై ఆజాద్ కామెంట్స్..
యునిఫామ్ సివిల్ కోడ్ (UCC)పై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం యునిఫామ్ సివిల్ కోడ్‌ని పక్కన పెట్టేయడమే మంచిదని తేల్చి చెప్పారు. అన్ని మతాల వాళ్లనూ ఇది అసహనానికి గురి చేస్తుందని వెల్లడించారు. బీజేపీ దీని గురించి ఆలోచించకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు.
"దేశవ్యాప్తంగా యునిఫామ్ సివిల్ కోడ్‌ని అమలు చేయడం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సింపుల్ కాదు. ఒక్క ముస్లింలకే కాదు. సిక్కులు, క్రైస్తవులు, ఆదీవాసీలు, పార్శీలు, జైనులు..ఇలా రకరాల మతాలకు చెందిన వాళ్లున్నారు. యూసీసీ పేరు చెప్పి ఇలా ఒకేసారి అన్ని వర్గాల వారి ఆగ్రహానికి గురి కావడం బీజేపీకి అంత మంచిది కాదు. నన్నడిగితే..అసలు ఆ ఆలోచన చేయకపోవడమే మంచిది"
- గులాం నబీ ఆజాద్, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ
ఎన్నికల కోసం చూస్తున్నాం..
ఇదే సమయంలో జమ్ముకశ్మీర్ ఎన్నికల గురించీ ప్రస్తావించారు ఆజాద్. 2018లో అసెంబ్లీ రద్దైనప్పటి నుంచి మళ్లీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యం ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తున్నారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల చేతుల్లోనే పరిపాలనాధికారాలు ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇవీ సవాళ్లు..
ఈ బిల్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని చూస్తోంది బీజేపీ. అయితే...ముస్లింల నుంచే కాకుండా ఈశాన్య రాష్ట్రాల ప్రజల నుంచి కూడా Uniform Civil Codeపై అసహనం వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలు ఈ పేరు చెబితేనే మండి పడుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే...ఆయా రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నాయి. మేఘాలయాలో బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కనార్డ్ సంగ్మా వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. "ఇది భారతీయతకు సరిపడే చట్టం కాదు" అని తేల్చి చెప్పారాయన. అంతే కాదు. అంతకన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంగ్మా. "భారతదేశంలో ఎన్నో విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలున్నాయి. వాటన్నింటిలోనూ ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి చాలా ఇంకాస్త విభిన్నమైంది. దాన్ని కాపాడుకునేందుకు మేం ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాం" అని వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాలు భారత్‌కే కాదు. మొత్తం ప్రపంచానికే ప్రత్యేకం. అక్కడ ఉన్నన్ని సంస్కృతులు ఇంకెక్కడా కనిపించవు. దాదాపు 220 జాతులకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. ట్రైబల్స్ సంఖ్య కూడా ఎక్కువే. 2011 జనాభా లెక్కల ప్రకారం..మిజోరంలో 94.4%, నాగాలాండ్, మేఘాలయాల్లో వరుసగా 86.5%, 86.1% గిరిజనులున్నారు. అంటే వీళ్లదే అత్యధిక జనాభా. వీళ్లంతా భారత రాజ్యాంగానికి లోబడి ఉంటూనే తమ తమ ఆచారాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు యునిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే...వాళ్ల ఆచారాలు దెబ్బ తింటాయని ఆందోళన చెందుతున్నారు వారంతా. మిజోరం, నాగాలాండ్, మేఘాలయాలో ఈ అసహనం ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read: రైల్వే ప్యాసింజర్స్‌కి గుడ్ న్యూస్, తగ్గనున్న వందేభారత్ టికెట్ ధరలు - ఏసీ చైర్ కార్ ఛార్జీలు కూడా