DRDO Scientist: 


ప్రదీప్‌పై ఛార్జ్‌షీట్ 


డీఆర్‌డీవో (DRDO) సైంటిస్ట్ ప్రదీప్ కురుల్కర్ (Pradeep Kurulkar ) హనీట్రాప్‌లో ఇరుక్కున్నారు. పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ ఆపరేటివ్‌కి చెందిన జరా దాస్‌గుప్తా (Zara Dasguptas) ఆయనకు వల విసిరింది. చాలా రోజుల పాటు చాటింగ్ చేసింది. మెల్లగా ఇండియన్ మిజైల్ సిస్టమ్‌కి సంబంధించిన కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. తియ్యనైన మాటల్తో కవ్వించి ముఖ్యమైన డిఫెన్స్ ప్రాజెక్ట్‌ల సమాచారాన్నీ చోరీ చేసింది. దీన్ని గుర్తించిన అధికారులు సైంటిస్ట్‌ ప్రదీప్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. మహారాష్ట్ర పోలీస్‌ విభాగానికి చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) గత వారమే ఈ ఛార్జ్‌షీట్ దాఖలైంది. ప్రదీప్ కురుల్కర్ DRDO ల్యాబ్ డైరెక్టర్లలో ఒకరు. Official Secrets Act కింద మే 3వ తేదీనే ఆయనను అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కురుల్కర్, జరా దాస్‌గుప్త వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్నారు. వాళ్లిద్దరి మధ్య వాయిస్, వీడియో కాల్స్ కూడా నడిచినట్టు విచారణలో తేలింది. ఛార్జ్‌షీట్‌లోని వివరాల ప్రకారం...జరా దాస్‌గుప్తా తనను తాను యూకేకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పరిచయం చేసుకుంది. కావాలనే కొన్ని అశ్లీల మెసేజ్‌లు వీడియోలు పంపింది. అయితే..విచారణలో భాగంగా ఆమె IP అడ్రెస్‌ని చెక్ చేశాక కానీ తెలియలేదు ఆమె పాకిస్థాన్‌ మహిళ అని. 


వాట్సాప్‌లోనే అంతా..


బ్రహ్మోస్ లాంఛర్, డ్రోన్, UCV, అగ్ని మిజైల్ లాంఛర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్‌తో పాటు మరి కొన్ని కీలక ప్రాజెక్ట్‌ల వివరాలను తెలుసుకునేందుకు చాలా ప్రయత్నించింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని తన ఫోన్‌లో స్టోర్ చేసుకున్నాడని, ఆమె అడిగిన వెంటనే వాటిని పంపించాడని ఆరోపణలున్నాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకూ ఇద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారు. ప్రదీప్‌పై అనుమానంతో అధికారులు అంతర్గతంగా విచారించడం మొదలు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన ఆ సైంటిస్ట్‌ జరా దాస్‌గుప్తా ఫోన్‌ నంబర్‌ని బ్లాక్ చేశాడు. ఆ తరవాత మరో వాట్సాప్ నంబర్ నుంచి "ఎందుకు నన్ను బ్లాక్ చేశారు" అని మెసేజ్ వచ్చింది. విచారణలో తేలిందేంటంటే...ప్రదీప్ కేవలం DRDO సమాచారమే కాకుండా తన వ్యక్తిగత వివరాలనూ ఆమెతో షేర్ చేసుకున్నాడు. 


హనీట్రాప్‌ అంటే..
ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా సెక్సువల్ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని‘హనీ ట్రాప్’ అంటారు. ఈ మధ్య కాలంలో మనం తరుచుగా హనీట్రాప్‌ అనే పేరును వింటూనే ఉన్నాం. మొదట అమాయకుల్ని అందచందాలతో తమ వైపు లాక్కోవడం.. ఆ తరువాత వారితో వీడియో కాల్ చేయడం, ఆపై వాళ్ల న్యూడ్‌ వీడియోస్‌ రికార్డ్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేయడం అనేది కామన్‌ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇదే రకమైన ఘటనలు వెలగులోకి వస్తున్నాయి. మనుషుల బలహీనతలను, ఆశనే పెట్టుబడిగా పెట్టి హనీట్రాప్‌ నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఈ రకమైన మోసాలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. అప్రమత్తంగా లేకుంటే డబ్బులు పోవడంతో పాటు, పరువు, ప్రతిష్టలకు భంగం కలగక తప్పదు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, ఉద్యోగులే లక్ష్యంగా మహిళల పేరుతో ఈ నేరాలకు దిగుతున్నారు.


Also Read: అమ్మో మగాళ్లు మహా జాదూగాళ్లు, ఆడవాళ్ల కన్నా ఎక్కువ అబద్ధాలు చెబుతున్నారట - సర్వే