Millennials Lie: 


మిలీనియల్స్‌ అబద్ధాలు..


అందరి కంటే ఎక్కువగా మిలీనియల్స్ (Millennials Lies) అబద్ధాలు చెప్తారని ఓ సర్వే వెల్లడించింది. 1981-96 మధ్య కాలంలో పుట్టిన వాళ్లను మిలీనియల్స్ అంటారు. వర్క్‌ ప్లేస్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందరినీ బోల్తా కొట్టించేస్తారని చెప్పింది. మిగతా ఏజ్‌ గ్రూప్‌లతో పోల్చి చూస్తే...చాలా సింపుల్‌గా అబద్ధాలు ఆడేస్తారని తెలిపింది. ఆన్‌లైన్ క్యాసినో PlayStar ఈ సర్వే చేపట్టింది. మొత్తం 1,306 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఏయే సందర్భాల్లో వాళ్లు అబద్ధాలు చెబుతారో అడిగి తెలుసుకుంది. అమెరికాలోని కొలొరాడో, ఇల్లినోయిస్, న్యూ జెర్సీ, న్యూయార్క్ సహా మరి కొన్ని రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది. మిలీనియల్స్ ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నట్టు గుర్తించింది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 13% మంది "రోజూ ఏదో ఓ అబద్ధం చెబుతూనే ఉంటాం" అని చెప్పారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే...1946-64 మధ్య కాలంలో పుట్టిన వాళ్లలో కేవలం 2% మంది మాత్రమే రోజూ అబద్ధం చెబుతున్నారు. జనరేషన్ Z..అంటే 1997-2021 మధ్య కాలంలో జన్మించిన వారికి, 1965-80 మధ్య కాలంలో పుట్టిన వారికి అబద్ధాలు చెప్పే విషయంలో చాలా  దగ్గరి పోలికలున్నాయి. ఈ రెండు గ్రూప్‌లలోనూ రోజూ అబద్ధం చెప్పే వారి సంఖ్య 5%గా ఉంది. మిలీనియల్స్‌ మూడింట ఓ వంతు తమ రెజ్యూమ్‌లలో ఎన్నో అబద్ధాలు రాసినట్టు చెప్పారు. అంతే కాదు. వర్క్‌ ప్లేస్‌లో బాస్‌కి అబద్ధాలు చెప్పడంలోనూ వీళ్లే టాప్‌లో ఉన్నారు. 


సోషల్ మీడియాలో కూడా..


సోషల్ మీడియాలోనూ ఇంతే. కేవలం చుట్టూ ఉన్న వాళ్లను ఇంప్రెస్ చేయడానికి సోషల్ మీడియాలో అనవసరపు బిల్డప్‌లు ఇస్తామని చెప్పారు. ఏదో ఓ అబద్ధం చెప్పి అట్రాక్ట్ చేస్తామని వెల్లడించారు. మహిళల కంటే పురుషులే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారని తేలింది. అయితే...ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే. అబద్ధాలు చెప్పి ఎవరినో హర్ట్ చేయాలన్నది వాళ్ల ఉద్దేశం కాదట. కేవలం స్ట్రెస్‌ని తగ్గించుకునేందుకో, తప్పని పరిస్థితుల్లోనే అబద్ధాలు చెప్తామని వెల్లడించి వారి సంఖ్య 58%గా ఉంది. 42% మంది తమ ప్రైవసీని కాపాడుకునేందుకు ఇలా చేస్తామని తెలిపారు.