Hyderabad News: బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ కు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నెలరోజుల పాటు అక్కడే మకాం వేసి మరీ నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో నైజీరియాకు చెందిన అగ్ బో మ్యాక్స్ వెల్, ఇకెం ఆస్టిన్ ఒబాకా, చిగోజీలతో పాటు సాయి ఆకాశ్ అనే తెలుగు కుర్రాడిని అరెస్ట్ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ వివరించారు. బెంగళూరు నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని తెలిపారు. అప్రమత్తమైన నార్కోటిక్స్ విభాగం పోలీసులు దర్యాప్తు చేశారన్నారు. 


నలుగురు అరెస్ట్, ఒకరు పరార్


ఈక్రమంలోనే నెల రోజుల పాటు బెంగళూరులోనే మకాం వేసి... నైజీరియన్ల కదలికలపై నిఘా పెట్టారని వెల్లడించారు. అయితే ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేయగా.. మరో నైజీరియన్ పరారైనట్లు వివరించారు. ఈ కేసులో డ్రగ్స్ కింగ్ పిలన్ మ్యాక్స్ వెల్ ని ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు స్పష్టం చేశారు. మ్యాక్స్ వెల్, చిగోజి నైజీరియన్ నుంచి మెడికల్ వీసాపై వచ్చారని... మరో నిందితుడు ఒబాక విద్యార్థి వీసాపై వచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం పట్టుబడ్డ గ్యాంగ్ చాలా తెలివిగా డ్రగ్స్ సరఫరా, విక్రయాలు జరిపినట్లు తమ విచారణలో తేలిందన్నారు. 


నకిలీ అడ్రస్ లతో బ్యాంకు ఖాతాలు - కోట్లలో లావాదేవీలు


నకిలీ అడ్రస్ లతో బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించారు. దాదాపు ఆరు నెలల్లోనే 4 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు గుర్తించామన్నారు. నైజీరియన్ ముఠా సభ్యులు బెంగళూరులో ఉంటూ హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలిందన్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న హైదరాబాద్ వాసులు సంజయ్ కుమార్, తుమ్మ భాను తేజని పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఈక్రమంలోనే వారు డ్రగ్స్ ఎవరి దగ్గర, ఎలా కొనుగోలు చేశారో పోలీసులకు వెల్లడించారు. ఈ సమాచారంతోనే పోలీసులు దర్యాప్తు చేయగా.. గుట్టంతా రట్టు అయిందన్నారు. 


డ్రగ్స్ సరఫరా చేస్తున్న మహిళ అరెస్ట్


మూడ్రోజుల క్రితం నైరోబీ నుంచి షార్జా మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిందో మహిళ. అయితే బురుండీ దేశానికి చెందిన 43 ఏళ్ల మహిళ ఎయిర్ అరేబియా ఎయిర్ వేస్ విమానం జీ9458లో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే మహిళ పద్ధతి కాస్త తేడాగా, భయంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆమెను పక్కకు పిలిచి ఆమె లగేజీని తనిఖీ చేశారు. ఓ సంచిలో ఆఫ్రికా సంప్రదాయ దుస్తులు ఎనిమిది, మూడు సబ్బులు, ఒక హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి.


ఇంత సింపుల్ లగేజీతో వచ్చిన ఆమె ఎందుకు కాస్త కంగారుగా భయంతో ఉందని అధికారులకు అనుమానం వచ్చింది. ఆమె లగేజీని కాస్త నిశితంగా పరిశీలించగా అధికారులు షాక్ కు గురయ్యారు. ఆఫ్రికా సంప్రదాయ దుస్తులకు ఉన్న పెద్ద పెద్ద గుండీల్లో, సబ్బుల మధ్య ప్లాస్టిక్ కవర్ లో, హ్యాండ్ బ్యాగ్ అంచుల్లో హెరాయిన్ ఉన్నట్లు అర్థం అయింది. అయితే పౌడర్ రూపంలో ఉన్న హెరాయిన్ ను పొట్లాల్లో పెట్టి.. వాటిని గుండీలు, సబ్బులు, హ్యాండ్ బ్యాగ్ అంచుల్లో అమర్చినట్లు గుర్తించారు. 2.27 కిలోల ఆ హెరాయిన్ విలువ మార్కెచ్ ధర ప్రకారం రూ.14.2 కోట్లు ఉంటుందని అధికారులుల చెబుతున్నారు.