వైఎస్‌ జయంతి సందర్భంగా షర్మిల, జగన్ సహా ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా ఇడుపులపాయకు రానున్నారు. ఎవరికి వాళ్లు వేర్వేరుగా వస్తున్నారు. వైఎస్‌ సమాధికి నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం. 


వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని, ప్రియాంక టీంతో షర్మిల చేతులు కలపబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. పదే పదే వీటిని ఆమె ఖండిస్తున్నా తరచూ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఈ పుకార్లకు ఊతమిస్తున్నాయి. మొత్తానికి ఈ విషయంపై ఇడుపులపాయ వేదికగా ఏదో ఒకటి తేల్చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


వైఎస్‌ జయంతి సందర్భంగా గతేడాది వరకు అంతా కలిసి ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేవాళ్లు. కానీ ఈసారి ఎవరికి వారుగానే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శుక్రవారమే షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ ఉదయమే తల్లితో కలిసి తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించి తిరుగుపయనమవుతారు. 


సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. తండ్రి సమాధికి నివాళి అర్పిస్తారు. రెండేళ్లుగా చెల్లి షర్మిలతో విభేదాలు కారణంగా ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గతేడాది ఇద్దరూ కలిసి నివాళి అర్పించిన‌ప్పటికీ ముబావంగానే ఉన్నారు. ఈసారి మాత్రం వేర్వేరుగా వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఇష్టం లేకే ఇలా ప్లాన్ చేశారని ప్రచారం నడుస్తోంది. 


షర్మిల ఆస్తుల పంపకం 
శుక్రవారమే కడప చేరుకున్న షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల తన పేరు మీద ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. మరో 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకొని అక్కడే రాత్రి బస చేశారు.