BJP Using Adipurush Video: ఓం రౌత్ దర్శకత్వంలో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఆదిపురుష్. దాదాపు రూ. 600 కోట్లతో నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో పాత్రలు చూపించిన తీరు, కొన్ని డైలాగులు, కొన్ని సన్నివేశాల కారణంగా ఆదిపుష్ దర్శకుడు, టీమ్ తీవ్ర విమర్శల పాలైంది. తాజాగా ఆదిపురుష్ పాటలను బీజేపీ తెగ వాడేస్తుంది. ‘నరేంద్రుని ఆగమనం-ధర్మ సంస్థాపనం’ అంటూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది.
నరేంద్రుని ఆగమనం...
ఆదిపురుష్ సినిమాలో మోస్ట్ పాపులర్ సాంగ్‌గా నిలిచిన జై శ్రీరాం జై శ్రీరాం పాటను తెలంగాణ బీజేపీ వాడేస్తుంది. ప్రేక్షకుల మనసుకు హత్తుకుపోయిన జైశ్రీరాం పాటలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫోటోలతో బీజేపీ వీడియోను తయారు చేసింది. వీడియోలో నరేంద్రుని ఆగమనం- ధర్మసంస్థాపనం అనే పుస్తకం కనిపిస్తుంది. ఈ పుస్తకం తెరుచుకోగానే అందులో మోడీ ఫోటోలతో పాటకు సంబంధించిన లిరిక్స్ ను ఎడిట్ చేసింది. అంతేకాకుండా, లిరిక్స్ కి తగ్గ ఫోటోలతో, మోడీతో పాటు అమిత్ షా, నడ్డాల ఫోటోలు కనిపిస్తాయి.
‘నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం’ అంటూ బీజేపీ కార్యకర్తలు మోడీ వెంట ఉండే ఫోటోలను వీడియోలు చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు తమదైన శైలీలో ప్రచారాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పని చేస్తోంది. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తూ ఈ విధంగా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.
భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఆదిపురుష్ చిత్రం నిరాశ మిగిల్చింది. మొదటిసారి ట్రైలర్ విడుదలైనప్పుడే చాలామంది కార్టూన్ లాగా ఉందని ట్రోల్స్ చేశారు. దీంతో మరోసారి సినీ బృందం మార్పులు చేసి మరోసారి విడుదల చేయడంతో కొంతవరకు బాగానే అనిపించింది. కానీ, సినిమా చూసిన తర్వాత అందరూ తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ ఓంరౌత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అందులో రామాయణం ఎక్కడ ఉందని, అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇదేనా నువు చేసింది అంటూ విమర్శించారు. సినిమాలో రావణుడి వేషాధరణ, వాహనం, లంకను చూపించిన విధానంపై ప్రేక్షకులు, హిందువులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏదో వీడియో గేమ్ లాగా సినిమాను చిత్రీకరించినట్లు ఉందని, అసలు రామాయణాన్ని ఎవరైనా ఇలా తీస్తారా అంటూ డైరెక్టర్ ఓం రౌత్‌పై ప్రేక్షకులు ఫైర్ కావడం తెలిసిందే. సినిమాను బ్యాన్ చేయాలని, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ పలు రాష్ట్రాల్లో నిరసలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా పాటతో బీజేపీ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.