మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) కథానాయకుడిగా, శ్రీ లీల (Sreeleela) కథానాయికగా రూపొందిన సినిమా 'ఆదికేశవ' (Aadikeshava Movie). శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తున్న చిత్రమిది. సూర్యదేవర నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మాతలు.


ఆగస్టు 18న 'ఆదికేశవ' విడుదల 
Aadikeshava Release Date : 'ఆదికేశవ' సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాను ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 


వైష్ణవ్ తేజ్, శ్రీ లీల తొలిసారి జంటగా నటించిన చిత్రమిది. దీనిని యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఆయన విలన్ రోల్ చేశారు.


Also Read : ఆగస్టులో 'బెదురులంక 2012' - ఫైనల్లీ, కొత్త రిలీజ్ డేట్‌తో వచ్చిన కార్తికేయ






'ఇంత తవ్వేశారు! ఆ గుడి జోలికి మాత్రం రాకండయ్యా!' - 'ఆదికేశవ' ఫస్ట్ గ్లింప్స్ (Aadikeshava First Glimpse) ప్రారంభంలో వినిపించిన డైలాగ్! ఆ మాట వినిపించే సమయంలో స్క్రీన్ మీద చూస్తే... గుడి వెనుక అంతా తవ్వేసిన దృశ్యం! గుడిలో శివ లింగానికి హారతి ఇస్తున్న పూజారి! ఆ తర్వాత దృశ్యాలు చూస్తే... కథ ఏమిటి? అనేది చాలా క్లారిటీగా అర్థం అయిపోతుంది.


గుడికి రక్షకుడిగా రుద్ర కాళేశ్వర్!
'ఆదికేశవ' సినిమాలో కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ పేరు రుద్ర కాళేశ్వర్ రెడ్డి. మైనింగ్ చేసే కొందరు గుడి వెనుక భాగం అంతా తవ్వేస్తారు. ఆ తర్వాత గుడిని కూడా తవ్వేయాలని వస్తారు. అప్పుడు వాళ్ళను హీరో ఎలా అడ్డుకున్నాడు? ఆ గుడికి రక్షకుడిగా ఎలా నిలబడ్డాడు? అనేది కథాంశంగా తెలుస్తోంది. అయితే, ఈ స్టోరీ లైన్ చాలా మందికి గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ ఇష్యూను గుర్తు చేస్తోంది. 


గాలి జనార్ధన్ రెడ్డి ఎందుకు వచ్చారు?
ఇప్పుడు అంటే గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy) పేరు వినబడటం లేదు గానీ... ఒక సమయంలో ఆయన కేంద్ర బిందువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాజకీయాలు సాగాయి. గాలి జనార్ధన్ రెడ్డికి మైనింగ్ కింగ్ అని, మైనింగ్ మాఫియా అని కొందరు పేర్లు పెట్టారు. 


ఏపీలో గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ వ్యాపారం కొన్నేళ్ళు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాగింది. అయితే, ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని సుంకులమ్మ గుడిని పగలగొట్టారు. ఆ గుడి జోలికి వెళ్లిన తర్వాత ఆయన పతనం ప్రారంభమైందని చెబుతారు. సుంకులమ్మ గుడి వల్లే తనకు ఈ గతి పట్టిందని ఒక ఇంటర్వ్యూలో గాలి జనార్ధన్ రెడ్డి సైతం వ్యాఖ్యానించారు. 


Also Read నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?


'ఆదికేశవ' సినిమా ఫస్ట్ గ్లింప్స్ చూసిన తర్వాత... మైనింగ్ ఏరియాలో ఉన్న గుడిని కూల్చడం నేపథ్యంలో కథ కావడంతో చాలా మందికి గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ గుడి వివాదం గుర్తుకు వచ్చింది. సినిమా విడుదలైతే తప్ప అది నిజమా? కాదా? అనేది తెలియదు. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial