సినిమా రివ్యూ : ఓ సాథియా 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి, చైతన్య గరికపాటి, అన్నపూర్ణమ్మ, దేవి ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, శివన్నారాయణ, క్రేజీ ఖన్నా తదితరులు
ఛాయాగ్రహణం : ఈజే వేణు 
సంగీతం : వినోద్ కుమార్ (విన్ను)
నిర్మాతలు : చందన కట్టా, సుభాష్‌ కట్టా
రచన, దర్శకత్వం : దివ్య భావన
విడుదల తేదీ: జూలై 7, 2023


తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాఫోన్ పట్టిన మహిళలు తక్కువ. మహిళా దర్శకుల సంఖ్య తక్కువ. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు చేరింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దగ్గర పనిచేసిన దివ్య భారతి... 'ఓ సాథియా' (O Saathiya Movie) సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఇందులో ఆర్యన్ గౌర హీరో. నితిన్ 'చిన్నదాన నీకోసం', సుమంత్ అశ్విన్ 'కొలంబస్' సినిమాల్లో నటించిన మిస్తీ చక్రవర్తి హీరోయిన్. ఈ సినిమా ఎలా ఉందంటే?


కథ (O Saathiya Movie Story) : అర్జున్ (ఆర్యన్ గౌర) విశాఖ యువకుడు. కాలేజీలో జూనియర్ కీర్తి (మిస్తీ చక్రవర్తి)ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ప్రపోజ్ కూడా చేస్తాడు. అయితే... చెప్పాపెట్టకుండా కీర్తి ఫ్యామిలీ విశాఖ వదిలి వెళుతుంది. లవ్ ఫెయిల్యూర్ పెయిన్ ఎలా ఉంటుందో అప్పుడు అర్జున్ కు తెలుస్తుంది. వీబీఐటీ కాలేజ్, హైదరాబాద్‌లో కీర్తి చదువుతుందని తెలిసి సప్లమెంటరీ పరీక్షలు అన్నీ ఒకేసారి రాసి పాస్ అయ్యి మరీ ఆమె కాలేజీలో జాయిన్ అవుతాడు. అయితే... ఆమె మరొకరితో ప్రేమలో ఉన్నదని, పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి ఫీల్ అవుతాడు. కొన్ని రోజులకు కీర్తికి బ్రేకప్ కావడం, అర్జున్ దగ్గరకు రావడం, ఇద్దరు ప్రేమలో పడటం జరుగుతాయి. ఆ తర్వాత ఇద్దరూ ఎందుకు విడిపోయారు? వేరొకరితో పెళ్ళికి కీర్తి ఎందుకు సిద్ధమైంది? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.    


విశ్లేషణ (O Saathiya Movie Review) : ప్రతి ఒక్కరి జీవితంలో తొలిప్రేమ ప్రత్యేకం. ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ ప్రేమ దగ్గరకు వచ్చిన్నట్టే వచ్చి మళ్ళీ మళ్ళీ దూరం అవుతుంటే... అబ్బాయి పడే వేదన ఎలా ఉంటుంది? అనేది క్లుప్తంగా సినిమా కథాంశం. 


'ఓ సాథియా'లో కొత్త విషయం ఏమీ చెప్పలేదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురయ్యే ప్రేమే ఉంది. విశ్రాంతి వరకు ఇదొక సాదాసీదా కథగా ఉంటుంది. అప్పటి వరకు సాగిన కథ ఇప్పటికే తెలుగు తెరపై పలు సినిమాల్లో చూసిన కాలేజీ ప్రేమ కథలను మనకు గుర్తు చేస్తుంది. ఆ సీన్లు ఏవీ కొత్తగా లేకపోగా... సినిమా చాలా అంటే చాలా నిదానంగా ముందుకు సాగుతుంది. 


విశ్రాంతి తర్వాతే 'ఓ సాథియా'లో అసలైన కథ మొదలైంది. సీరియస్ గ్రాఫ్ అంటూ ఒకటి కనపడుతుంది. ఇంకా చెప్పాలంటే... పతాక సన్నివేశాలు మనసులను టచ్ చేసేలా ఉన్నాయి. హీరోకి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో హీరోయిన్ చెప్పే సన్నివేశాల్లో కథంతా దాగి ఉంది. ప్రేమకు, కుటుంబ పరిస్థితులకు మధ్య నలిగిన అమ్మాయిగా కథానాయిక పాత్రను మలిచిన తీరు బావుంది. తండ్రి కుమారుడు, తల్లి కుమార్తె మధ్య సన్నివేశాల్లో అనుబంధాలను ఆవిష్కరించారు. వినోద్ కుమార్ స్వరపరిచిన పాటలు, ఛాయాగ్రహణం కథకు బలంగా నిలిచాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. 


నటీనటులు ఎలా చేశారు? : మిస్తీ చక్రవర్తికి పదికి పైగా సినిమాలు చేసిన అనుభవం ఉంది. నటనలో ఆ అనుభవం కనిపించింది. కీర్తి పాత్రలో మిస్తీ చక్రవర్తి ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, పతాక సన్నివేశాల్లో మిస్తీ నటన ఆకట్టుకుంటుంది. హీరో ఆర్యన్ గౌర నటన ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో బావుంది. లుక్స్ పరంగా వేరియేషన్ చూపించారు. వయసుకు తగ్గట్టు అల్లరి, చిలిపితనం, బ్రేకప్ తర్వాత పరిణితి... నటనలో చూపించే ప్రయత్నించారు. దేవి ప్రసాద్, అన్నపూర్ణమ్మ, కల్పలత, ప్రమోదిని, శివన్నారాయణ తదితరులు తెరపై ఎంత సేపు కనిపించారనేది పక్కన పెడితే... ఉన్నంతలో పాత్రలకు న్యాయం చేశారు. 


Also Read : 'రుద్రంగి' రివ్యూ : 'బాహుబలి' రైటర్ దర్శకత్వంలో జగపతిబాబు నటించిన సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : ప్రతి మనిషి ఏదో ఓ వయసులో అనుభూతి చెందే తొలిప్రేమపై తీసిన సినిమా 'ఓ సాథియా'. ప్రథమార్థం రొటీన్ పంథాలో సాగినా... ద్వితీయార్థంలో భావోద్వేగాలు మనసులను స్పృశించేలా ఉన్నాయి. రొమాంటిక్ కామెడీలు, ప్రేమ కథలు మెచ్చే ప్రేక్షకులు... ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే ఎంజాయ్ చేయవచ్చు. ప్రేమికులు, యువత మెచ్చే అంశాలు ఉన్నాయి. 


Also Read  నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial