సినిమా రివ్యూ : రుద్రంగి
రేటింగ్ : 2.75/5
నటీనటులు : జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు
ఛాయాగ్రహణం : సంతోష్ శనమోని
సంగీతం : నాఫల్ రాజా
నిర్మాత : రసమయి బాలకిషన్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : అజయ్ సామ్రాట్
విడుదల తేదీ: జూలై 7, 2023


'బాహుబలి' మాటల రచయితలలో ఒకరైన అజయ్ సామ్రాట్ (Ajay Samrat) దర్శకుడిగా పరిచయమైన సినిమా 'రుద్రంగి' (Rudrangi Movie). తెలంగాణ దొర సంస్కృతి నేపథ్యంలో రూపొందించారు. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉంది? 


కథ (Rudrangi Movie Story) : భీమ్ రావ్ (జగపతి బాబు) దొర. భార్య మీరాబాయి (విమలా రామన్) బతికుండగా... మరో మహిళ జ్వాలాబాయి దేశ్ ముఖ్ (మమతా మోహన్ దాస్)ను పెళ్లి చేసుకుని గడికి తీసుకు వస్తాడు. తన సొగసు రాజ్యం ఎలుకోమని దగ్గరకు వస్తే ఆడతనం లేదని పక్కన పెడతాడు. దొరకు నమ్మిన బంటు మల్లేష్ (ఆశిష్ గాంధీ) మీద మనసు పడుతుంది జ్వాల. అదే సమయంలో వేటకి వెళ్ళిన భీమ్ రావ్ కంట పడుతుంది రుద్రంగి (గానవి లక్ష్మణ్). ఆమెను అనుభవించాలని అనుకంటాడు. అయితే... చేతికి చిక్కినట్టే చిక్కి జారుకుంటుంది. 


ఆ అమ్మాయిని వెతికి తీసుకొచ్చిన మల్లేష్... రుద్రంగి తన మరదలు అని, తమను వదిలేయమని చెబుతాడు. నమ్మించి రుద్రంగి మీద అత్యాచారం చేయడానికి భీమ్ రావ్ ప్రయత్నిస్తాడు. అప్పుడు మల్లేష్ ఎదురు తిరుగుతాడు. అతడిని జ్వాల మద్దతు ఇస్తుంది. ఆ తర్వాత ఏమైంది? మల్లేష్ గతం ఏమిటి? దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దొర కింద బానిసల్లా బతుకుతున్న రుద్రంగి ప్రజల కోసం మల్లేష్ దంపతులు ఏం చేశారు? రుద్రంగిని అనుభవించడం కోసం భీమ్ రావ్ ఏం చేశాడు? చివరకు ఎవరు ఎవరిని ఏం చేశారు? అనేది తెర మీద చూడాలి.


విశ్లేషణ (Rudrangi Movie Review) : తెలంగాణ దొర సంస్కృతి, గడీల నేపథ్యంలో 'ఒసేయ్ రాములమ్మ'తో పాటు కొన్ని చిత్రాలు వచ్చాయి. అయితే... ప్రజల విముక్తి కోసం అప్పట్లో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు మాన త్యాగాలు కూడా చేశారు. వాళ్ళ త్యాగాలకు అర్పించిన నివాళిగా 'రుద్రంగి'ని చెప్పవచ్చు. 


'రుద్రంగి' ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కువ సన్నివేశాల్లో భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. సీన్స్, ఎమోషన్స్ విషయంలో దర్శకుడు అజయ్ మంచి కమాండ్ చూపించాడు. ముఖ్యంగా మాటలు చాలా బావున్నాయి. అయితే నిర్మాణపరమైన పరిమితులు తెలుస్తూ అడుగడుగునా తెలుస్తున్నాయి. భారీ బడ్జెట్ ఇస్తే మంచి సినిమా తీసే ప్రతిభ దర్శకుడిలో ఉందని 'రుద్రంగి' చూస్తే అర్థం అవుతుంది. 


'చూసే కళ్లకు ఏం తెలుస్తది, మోసే గుండెకి తెలిస్తది', 'గుండెల నిండా కన్నీళ్లు నింపుకొన్నొడికి గొంతుల నుంచి మాట ఎలా వస్తది' వంటి మాటలు సన్నివేశాల్లో ఆత్మను తెరపై ఆవిష్కరించాయి. నటీనటులు తమ ప్రతిభతో ఆ సన్నివేశాల్లో భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరువ అయ్యేలా చేశారు. అయితే... కథగా చూస్తే 'రుద్రంగి'లో కొత్తదనం లేదు. ప్రథమార్థంలో ఉన్నవేగం ద్వితీయార్థంలో లేదు. దొరకు బానిస లాంటి బంటు ఎదురు తిరిగిన తర్వాత ఏమవుతుంది? అనేది ప్రేక్షకుల ఊహకు సులభంగా అందే అంశమే. మళ్ళీ జగపతి బాబు క్యారెక్టరైజేషన్, పతాక సన్నివేశాలు చిన్నపాటి షాక్ మూమెంట్, వావ్ ఫ్యాక్టర్ ఇస్తాయి. విశ్రాంతి తర్వాత కథను వేగంగా నడిపి ఉంటే బావుండేది. కెమెరా వర్క్, మ్యూజిక్ బావున్నాయి. కైలాష్ ఖేర్ పాడిన పాట, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు గూస్ బంప్స్ గ్యారంటీ. 


నటీనటులు ఎలా చేశారు? : 'రుద్రంగి'లో అసలు సిసలైన కథానాయకుడు జగపతి బాబు. ఆయన పోషించిన భీమ్ రావ్ పాత్రలో ప్రతినాయక ఛాయల ఉన్నాయి. కానీ, సినిమా చూస్తుంటే ఆయన హీరోలా కనిపిస్తారు. నటుడిగానూ కొత్త జగపతి బాబు కనిపిస్తారు. నటనలోనూ కొత్త కోణం చూపించారు. ఆయన చేసే ఒక విధమైన గర్జన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. 


జగపతి బాబు తర్వాత ప్రేక్షకులకు ఎక్కువ గుర్తుండే పాత్ర మమతా మోహన్ దాస్. దొరతనం, రాజసం కలగలిపిన పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. విమలా రామన్ సైతం పాత్ర న్యాయం చేశారు. ఆమె చక్కగా నటించారు. మల్లేష్ పాత్రకు అవసరమైన కండపుష్టి ఆశిష్ గాంధీకి ఉంది. పౌరుషం చూపే సన్నివేశాలతో పాటు జగపతి బాబు పాత్రకు కట్టుబానిసలా చక్కగా చేశారు. 'వేద' ఫేమ్ గానవి లక్ష్మణ్, 'కాలకేయ' ప్రభాకర్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. నిర్మాత రసమయి బాలకిషన్ ఓ పాటలో తళుక్కున మెరిశారు.


Also Read : '7:11 పీఎం' సినిమా రివ్యూ : టైమ్ ట్రావెల్ చేసి మరీ ఓ ఊరిని హీరో కాపాడితే?


చివరగా చెప్పేది ఏంటంటే? : జగపతి బాబు, మమతా మోహన్ దాస్ నటన కోసం అయినా సరే 'రుద్రంగి'ని చూడొచ్చు. మాటల్లో, సన్నివేశాల్లో దర్శకుడు అజయ్ సామ్రాట్ కమాండ్ చూపించారు. పీరియాడిక్ ఫిలిమ్స్ ఇష్టపడే, చూడాలని కోరుకునే ప్రేక్షకుల్ని 'రుద్రంగి' మెప్పిస్తుంది.  


Also Read నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial