Jharkhand Railway Bridge: 



తృటిలో తప్పిన ప్రమాదం..


ఈ మధ్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలే బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత మళ్లీ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం జరిగి దాదాపు 5-6 బోగీలు కాలిపోయాయి. దీనికి కారణాలేంటో...తేలాల్సి ఉంది. ఇది మర్చిపోక ముందే మరో ఘోర్ ప్రమాదం తప్పింది. ఝార్ఖండ్‌లోని సుబర్ణరేఖ రైల్వే బ్రిడ్జ్ ( Subarnarekha Railway Bridge) పట్టాలపై ఓ చోట మూడు నట్స్‌, బోల్ట్స్ కనిపించకపోవడం కాసేపు అలజడి రేపింది. హతియా-రౌర్కేలా రైల్వే లేన్‌లో ఓ చోట నట్‌లు, బోల్ట్‌లు లేకపోవడాన్ని సిబ్బంది ముందస్తుగా గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు వెంటనే దాన్ని రిపేర్ చేశారు. పోలసులకు ఫిర్యాదు చేశారు. బ్రిడ్జ్‌పై పోల్‌ నంబర్ 428 వద్ద కొందరు దుండగులు వీటిని కావాలనే తొలగించి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. 


ఫలక్‌నుమా రైల్లో ప్రమాదం..


హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లో అగ్ని ప్రమాదం (Falaknuma Express Accident) జరిగింది. ప్రయాణికుల అప్రమత్తతోనే ఘోర ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. పొగలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారని, అంతలోనే రైలు ఆగిపోవడంతో హుటాహుటినా అందరు రైలు దిగి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఒక్కో బ్యాగు మాత్రమే ఉన్న వారు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారు వెంటనే రైలు దిగిపోగా.. ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తున్న వారు, కుటుంబంతో కలిసి ఉన్న వారి పరిస్థితి దారుణంగా మారింది. ఓ వైపు మంటలు పెరిగిపోతూ ఒక బోగీ నుంచి మరో బోగీకి వ్యాపిస్తుండగా.. కిక్కిరిసిపోయిన ప్రయాణికుల నుంచి కుటుంబసభ్యులను, లగేజీని బయటకు తీసుకువచ్చేందుకు అవస్థ పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు బోగీలకు వ్యాపించి పూర్తిగా కాలిపోయే లోపే ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు.


దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు రోజుల క్రితం ఓ బెదిరింపు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి ఫ్రమ్‌ అడ్రెస్ లేకుండానే వచ్చిందా లేఖ. మరో నాలుగు రోజుల్లో ఒడిశా తరహా ఘటన చూడబోతున్నారంటూ ఆగంతకులు ఆ లేఖలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన రైలు ట్రాక్ పైనే ఉండటంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఈ విషయంలో గుర్తించాలని సూచించారు. రైలు ప్రమాదాల్లో ఎక్కువ శాతం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని గతంలో పలు రిపోర్ట్‌లు స్పష్టం చేశాయి. బాలాసోర్‌ ఘటన అందుకు ఉదాహరణ. సిగ్నలింగ్ సిస్టమ్‌లోని లోపాలతో ఘోర ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఝార్ఖండ్‌లోనూ అదే జరిగేదేమో. ముందుగానే గుర్తించడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


Also Read: అమ్మో మగాళ్లు మహా జాదూగాళ్లు, ఆడవాళ్ల కన్నా ఎక్కువ అబద్ధాలు చెబుతున్నారట - సర్వే