Credit Card Usage Tips To Build Credit Score: ఇప్పుడు, చాలా మంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కనిపిస్తున్నాయి, ఇదొక సాధారణ విషయంలా మారింది. ఎక్కువ క్రెడిట్‌ కార్డ్‌లు తీసుకోవడానికి... రివార్డులు పెంచుకోవడం, అవసరానికి ఖర్చు చేయడం లేదా కొనుగోలు శక్తిని పెంచుకోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. ఈ వెసులుబాట్లతో పాటు క్రెడిట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రిస్క్‌ను కూడా తీసుకొస్తాయి. ఈ నేపథ్యంలో, బహుళ క్రెడిట్ కార్డుల వాడకం క్రెడిట్ స్కోర్‌కు సాయపడుతుందా లేదా దెబ్బతీస్తుందా?. మీరు వాటిని ఎలా ఉపయోగిస్తారనే దానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది.

క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే కీలక అంశాలు

  • చెల్లింపుల చరిత్ర: క్రెడిట్‌ కార్డ్‌ బిల్లును సకాలంలో తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం. మీ స్కోర్‌ను నిర్ణయించడంలో దీనికి ఎక్కువ వెయిటేజీ ఉంటుంది.
  • క్రెడిట్ వినియోగం: మీ మొత్తం క్రెడిట్‌ లిమిట్‌లో మీరు ఉపయోగిస్తున్న భాగాన్ని ఇది సూచిస్తుంది. తక్కువ వినియోగం సాధారణంగా మంచి క్రెడిట్ ప్రవర్తనను సూచిస్తుంది.
  • క్రెడిట్ చరిత్ర: సుదీర్ఘ కాలంగా బాధ్యతాయుతంగా ఉపయోగిస్తుంటే, ఆ ట్రాక్ రికార్డ్ మీకు అనుకూలంగా మారుతుంది.
  • క్రెడిట్ మిక్స్: క్రెడిట్ కార్డులు, రుణాలు (సెక్యూర్డ్ & అన్‌సెక్యూర్డ్) రెండూ మీ పేరిట ఉంటే, ఈ సమతుల్యత మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది.
  • కొత్త దరఖాస్తు: క్రెడిట్ కార్డ్‌ కోసం తరచూ దరఖాస్తు చేస్తుంటే అది మీ స్కోర్‌ను తగ్గిస్తుంది.

ఎక్కువ క్రెడిట్ కార్డులు - ప్రయోజనాలు

  • క్రెడిట్ వినియోగ నిష్పత్తి: ఎక్కువ కార్డులు మీ మొత్తం క్రెడిట్ పరిమితిని పెంచుతాయి. మీరు ఖర్చును అదుపులో ఉంచుకుంటే, మీ వినియోగం తక్కువగా ఉంటుంది. ఇది, క్రెడిట్ బ్యూరోలకు మీ పట్ల సదభిప్రాయం కలగజేస్తుంది.
  • రివార్డులు పెరుగుతాయి: వేర్వేరు కార్డులు క్యాష్‌బ్యాక్, ట్రావెల్ పాయింట్లు, ఇంధన తగ్గింపులు వంటి వివిధ ప్రోత్సాహకాలు అందిస్తాయి. కొనుగోళ్ల కోసం తగిన కార్డును ఉపయోగించడం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు.
  • క్రెడిట్ ప్రొఫైల్‌లో వైవిధ్యం: రుణాలతో పాటు బహుళ కార్డులను కలిగి ఉండటం వల్ల మీ క్రెడిట్ మిశ్రమం మెరుగుపడుతుంది, ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు సానుకూలంగా దోహదపడుతుంది.

ఎక్కువ క్రెడిట్ కార్డులు - నష్టాలు

  • చెల్లింపులు మిస్‌ కావచ్చు: ఎక్కువ కార్డుల వల్ల, బిల్లు చెల్లింపులకు ఎక్కువ గడువు తేదీలు ఉంటాయి. అందువల్ల, చెల్లింపు తేదీ ఒక్కోసారి మీకు గుర్తుండకపోవచ్చు, ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు చాలా గట్టిగా దెబ్బకొడుతుంది. పేమెంట్‌ హిస్టరీ అనేది క్రెడిట్ స్కోరింగ్‌లో అతి ముఖ్యమైన అంశం.
  • ఎక్కువ ఖర్చు చేయాలనే కోరిక: ఎక్కువ కార్డ్‌లు మీ చేతిలో ఉంటే అవసరం లేనివి కూడా కొనే ప్రమాదం ఉంది, బిల్లు చెల్లింపు నాటికి మీరు ఇబ్బంది పడవచ్చు. బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించకపోతే అప్పు & వడ్డీ చెల్లింపులు పెరుగుతాయి. ఇది మీ ఆర్థిక స్థిరత్వం & క్రెడిట్ స్కోర్ రెండింటినీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
  • దరఖాస్తుల ప్రభావం: క్రెడిట్‌ కార్డ్‌ కోసం మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా, క్రెడిట్‌ బ్యూరోల నుంచి బ్యాంక్‌ మీ క్రెడిట్‌ రిపోర్ట్‌ను తీసుకుంటుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం వల్ల మీ క్రెడిట్ రిపోర్ట్‌ కోసం ఎక్కువ విచారణలు వస్తాయి. ఇది మీ స్కోరులో తాత్కాలిక తగ్గుదలకు కారణం కావచ్చు.
  • సగటు క్రెడిట్ వయస్సు: కొత్త క్రెడిట్‌ కార్డ్‌ వల్ల మీ క్రెడిట్ చరిత్ర సగటు వయస్సు తగ్గుతుంది, ఇది మీ స్కోర్‌ను కొద్దిగా తగ్గిస్తుంది. ముఖ్యంగా పాత ఖాతాలు మూసివేసినా లేదా ఉపయోగించకుండా వదిలేసినా ఈ ప్రభావం కనిపిస్తుంది.

ఎక్కువ క్రెడిట్ కార్డులను నిర్వహించే చిట్కాలు

  • ఆటోమేటిక్ పేమెంట్‌ను సెటప్ చేయండి: కనీస చెల్లింపును ఆటోమేట్ చేయడం వలన ఆలస్య రుసుములు లేకుండా జాగ్రత్త పడవచ్చు, మీ చెల్లింపు చరిత్రను రక్షించుకోవచ్చు.
  • ఖర్చులపై ఓ కన్నేయండి: మీ కార్డ్ వినియోగంపై కచ్చితంగా నిఘా పెట్టాలి, మీ బడ్జెట్‌ పరిధిలోనే ఖర్చులు ఉండేలా చూసుకోవాలి. దీనికోసం బడ్జెటింగ్ యాప్‌లు లేదా ఎక్స్‌పెన్స్‌ ట్రాకర్‌లను ఉపయోగించువచ్చు.