Simple Tricks For Cheaper Life Insurance: జీవితం అనిశ్చితం. తలపై ఎక్కువ బాధ్యతలు ఉన్నప్పుడు కుటుంబానికి ఆర్థిక రక్షణను కచ్చితంగా అందించాలి. జీవిత బీమాతో ఇది సాధ్యమవుతుంది. అయితే, అధిక ప్రీమియంల కారణంగా ప్రజలు జీవిత బీమా కొనుగోలును వాయిదా వేస్తున్నారు. జీవిత బీమా కవరేజ్‌లో రాజీ పడకుండా, ఖర్చును తగ్గించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.
చవకైన జీవిత బీమాను అందించే 7 చిట్కాలు!
1. ముందుగానే కొనుగోలు, ఎక్కువ కాలపరిమితి
చిన్న వయస్సులో లేదా యువకులుగా ఉన్నప్పుడే పాలసీని కొనడం వల్ల తక్కువ ప్రీమియం ఉంటుంది. బీమా సంస్థలు యువకులను తక్కువ రిస్క్‌గా చూస్తాయి, తక్కువ ప్రీమియం వసూలు చేస్తాయి. ఎక్కువ పాలసీ వ్యవధిని ఎంచుకోవడం వల్ల కూడా ఖర్చు & వార్షిక చెల్లింపులు తగ్గుతాయి. ఉదాహరణకు.. 30 సంవత్సరాల టర్మ్ ప్లాన్ కోసం, సాధారణంగా, 15 సంవత్సరాల ప్లాన్ కంటే తక్కువ వార్షిక ఖర్చు అవుతుంది. త్వరగా ప్రారంభించడం వల్ల, వయస్సు ఆధారంగా ప్రీమియం పెంపుదల కూడా తగ్గుతుంది.
2. సరళమైన టర్మ్ ఇన్సూరెన్స్
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి లెక్కలు లేకుండా స్వచ్ఛమైన రక్షణను అందిస్తుంది. పొదుపు లక్షణాలతో కూడిన ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ పాలసీల వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. మీ ప్రాథమిక లక్ష్యం మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడం అయితే, సరళమైన టర్మ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. తక్కువ ధర కోసం వివిధ పాలసీలను ఆన్‌లైన్‌లో పోల్చి చూడండి.
3. ఆరోగ్యకరమైన జీవనశైలి
బీమా కంపెనీ ఆరోగ్యకరమైన వ్యక్తుల నుంచి తక్కువ ప్రీమియం వసూలు చేస్తాయి. ధూమపానం & మధ్యపానం మానుకోండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, సమతుల్య ఆహారం తీసుకోండి. తద్వారా తక్కువ ధర ప్రీమియానికి అర్హత సాధించండి. పాలసీ కొనుగోలుకు ముందు చేసే వైద్య తనిఖీల్లో మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారని నిరూపణ అయితే, ప్రీమియంలో డిస్కౌంట్ లభించవచ్చు.
4. ఏడాదికి ఒకేసారి చెల్లింపు, రైడర్‌లు
నెలవారీగా కాకుండా ఏడాది మొత్తానికి ఒకేసారి ప్రీమియం చెల్లించడం వల్ల ప్రాసెసింగ్ ఫీజ్ ఉండదు, మొత్తం ఖర్చు తగ్గుతుంది. మీకు అవసరం లేని రైడర్‌లను తీసేయడం వల్ల ఖర్చు ఇంకా తగ్గుతుంది.
5. పోర్ట్ చేసే అవకాశం
బీమా ప్రీమియంలు కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి. ఆన్‌లైన్‌లో వాటిని పోల్చడం వల్ల బెస్ట్ డీల్ పొందే అవకాశం ఉంది. చాలా బీమా కంపెనీలు టర్మ్ ప్లాన్‌లను పోర్ట్ చేయడానికి (మరొక కంపెనీకి మార్చుకోవడానికి) అనుమతిస్తాయి. కాబట్టి, ప్రత్యామ్నాయాల కోసం ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి.
6. గ్రూప్ లేదా కంపెనీ ప్లాన్
కంపెనీలు లేదా అసోసియేషన్లు ఆఫర్ చేసే గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వ్యక్తిగత పాలసీల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. వీటిలో తగిన రక్షణ లభించడంతో పాటు, ప్రీమియం కూడా చాలా తగ్గుతుంది. మీ కంపెనీ లేదా అసోసియేషన్ గ్రూప్ ప్లాన్ ఆఫర్ చేస్తే తిరస్కరించవద్దు.
7. క్రెడిట్ స్కోర్, పాలసీ లాప్స్
కొన్ని బీమా కంపెనీలు క్రెడిట్ స్కోర్‌ను కూడా చూస్తాయి, తద్వారా మీ ఆర్థిక బాధ్యతను అంచనా వేస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ మీ ప్రీమియం ఖర్చును కొంతమేర తగ్గించవచ్చు. పాలసీ లాప్స్ కాకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. పాలసీ లాప్స్ అయిన తర్వాత మళ్లీ కొనుగోలు చేసే సమయంలో, మీ వయస్సు & ఆరోగ్య మార్పులను కంపెనీ ఫ్రెష్‌గా పరిగణనలోకి తీసుకుంటుంది. తత్ఫలితంగా ప్రీమియం ఖర్చు పెరగవచ్చు.
జీవిత బీమా ప్రీమియం తగ్గించాలంటే తెలివైన ప్రణాళిక & క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి.