Salary Feels Useless Even With A Raise: జీతం మీద మాత్రమే ఆధారపడి బతికేవాళ్లకు 'శాలరీ హైక్' విలువ బాగా తెలుసు. జీతగాళ్లు శాలరీ హైక్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. అయితే, మీ జీతం పెరిగినప్పటికీ మీ జీవితంలో ఎదుగూబొదుగూ లేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా?. దానికి కారణం "అదృశ్య ద్రవ్యోల్బణం" (invisible inflation) కావచ్చు. పెరుగుతున్న ధరలు మాత్రమే కాదు, మీ డబ్బు తన విలువను కోల్పోవడం వల్ల కూడా మీ పెరిగిన జీతం సరిపోకపోవచ్చు. ఇవి అదృశ్య దోపిడీ శక్తులు. దీని గురించి, ముంబైకి చెందిన పెట్టుబడిదారుడు & స్టాకిఫై వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్షి X (గతంలో ట్విట్టర్)లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
"మీ జీతం ఎందుకూ పనికిరానిదిగా అనిపిస్తుంది (పెంపుతో కూడా)" అనే శీర్షికతో అభిజిత్ చోక్షి ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం ఎప్పుడూ ధర పెరిగినంత సూటిగా ఉండదని చోక్షి పేర్కొన్నారు. రూ. 10 మ్యాగీ నూడుల్స్ & రూ. 1 కోటి ఫ్లాట్‌ల వంటి ఉదాహరణలతో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. "మీరు సంపాదిస్తున్నది తక్కువ కాదు, కానీ మిమ్మల్ని నిశ్శబ్దంగా దోచుకుంటున్నారు" అని ట్వీట్‌లో చోక్షి వెల్లడించారు.
ప్రభావం చూపుతున్న 'ష్రింక్‌ఫ్లేషన్'పాలు, ఇంధనం, కిరాణా వంటి నిత్యావసర వస్తువుల ధరల్లో పెరుగుదల మనకు తెలుస్తుంది. అంటే, ద్రవ్యోల్బణం పెరుగుదల మనకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. అయితే, మన కొనుగోలు శక్తిని నిశ్శబ్దంగా హరించివేసే అదృశ్య ద్రవ్యోల్బణం కూడా పని చేస్తూనే ఉంటుంది. ఈ అదృశ్య ద్రవ్యోల్బణాన్నే "ష్రింక్‌ఫ్లేషన్" అంటారు. వాస్తవానికి, ఇది ప్రజలను మోసం చేయడానికి రూపొందించిన ఒక కార్పొరేట్ వ్యూహం. వస్తువులు, ఉత్పత్తుల ధరలు పెంచితే సాధారణంగానే మనకు కోపం వస్తుంది. ఈ విషయం కార్పొరేట్ కంపెనీలకు 'కరతలామలకం' (స్పష్టంగా తెలుసు). కాబట్టి, కార్పొరేట్ కంపెనీలు రేట్లు పెంచవు. కానీ.. నిశ్శబ్దంగా వస్తువుల పరిమాణం తగ్గిస్తాయి & ధరను అలాగే ఉంచుతాయి. దీని అర్ధం.. ప్రజలు ఒకే ధర చెల్లిస్తారు, కానీ గతం కంటే తక్కువ పొందుతారు". ఇదే "ష్రింక్‌ఫ్లేషన్".
ష్రింక్‌ఫ్లేషన్ కేవలం పాలు, కిరాణా వస్తువులకు మాత్రమే పరిమితం కాదు రియల్ ఎస్టేట్ వంటి పెద్ద రంగాల్లోనూ కనిపిస్తుందని చోక్షి వెల్లడించారు. ముంబై రియల్ ఎస్టేట్‌ను ఉదాహరణగా చూపారు. గత దశాబ్ద కాలంలో జీతాల్లో పెద్దగా పెరుగుదల లేదు. అదే సమయంలో ఇళ్ల అద్దెలు రెట్టింపు కాగా, సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ ధరలు రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పెరిగాయని వివరించారు. “అదృశ్య ద్రవ్యోల్బణం అనేది నిశ్శబ్ద దొంగతనం. మీరు దానిని చూడలేరు. కానీ, మీ దైనందిన జీవితంలో అనుభూతి చెందుతారు” అని చోక్షి పేర్కొన్నారు.
డిజిటల్ చెల్లింపులు & సబ్‌స్క్రిప్షన్ ఆధారిత రుసుములను ప్రస్తావిస్తూ, 2030 నాటికి డిజిటల్ ద్రవ్యోల్బణం గురించి హెచ్చరించారు. “2030 నాటికి మీరు తక్కువ పొందుతారు, ఎక్కువ చెల్లిస్తారు. జీవితం ఎటుపోతోందో అర్ధంగాక జుత్తు పీక్కుంటారు” అని చోక్షి హెచ్చరించారు.
పరిష్కార మార్గం కూడా ఉందినిశ్శబ్ధ ద్రవ్యోల్బణం లేదా ష్రింక్‌ఫ్లేషన్‌ను ఎదుర్కొనే మార్గం కూడా ఉంది. “సంపన్నుల తరహాలో ఆలోచించండి. ధనవంతులు ముందుగానే కొనుగోలు చేస్తారు, వ్యవస్థలో పెట్టుబడి పెడతారు, తద్వారా చెడు ప్రభావం వారిపై పడకుండా జాగ్రత్త పడతారు. ఈ ముందుచూపు లేనివాళ్లను ప్రతి కుదుపు మానసికంగా & ఆర్థికంగా అలసిపోయేలా చేస్తుంది” అని చోక్షి చెప్పారు. కాబట్టి.. పొదుపుపైమాత్రమే ఆధారపడటం మానేసి, బంగారం, భూమి & నైపుణ్యాభివృద్ధి వంటివాటిలోనూ పెట్టుబడులు పెట్టాలని ప్రజలకు సూచించారు.