IPL 2025 PBKS VS RCB Updates: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 18 బంతుల్లో 23 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో ఐపీఎల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మార్కును దాటిన రెండో భారతీయ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. కేవలం 30వ ఇన్నింగ్స్ లోనే రజత్ పాటిదార్ ఈ ఘనత సాధించాడు. దీంతో సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ (31 ఇన్నింగ్స్) లను అధిగమించి వెయ్యి పరుగుల క్లబ్ లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
అలాగే వెయ్యి పరుగులను 35 సగటు, 150కి పైగా స్ట్రైక్ రేట్ తో సాధించి, అత్యంత వేగంగా ఈ మార్కును చేరిన ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు. అందరికంటే మిన్నగా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్ ల్లోనే వెయ్యి పరుగులను సాధించడం విశేషం. మరోవైపు తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ 33 ఇన్నింగ్స్ లో ఈ మార్కును చేరుకుని ఈ జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అయితే పంజాబ్ తో మ్యాచ్ రజత్ కు పీడకలను మిగిల్చింది. ఐదు వికెట్లతో ఈ మ్యాచ్ లో ఆర్సీబీ పరాజయం పాలైంది. సొంతగడ్డపై వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.
బ్యాటర్ల వల్లే..పంజాబ్ పై ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని రజత్ పాటిదార్ వ్యాఖ్యానించాడు. పిచ్ ఎలాంటిదైనా కనీస ప్రదర్శన చేయాల్సిన అవసరముందని, ఆ విషయంలో తమ బ్యాటింగ్ యూనిట్ విఫలమైందని పేర్కొన్నాడు. పిచ్ ను చాలాసేపు కవర్లతో కప్పి ఉంచారని, అందుకే బౌలర్లకు అనుకూలించిందని, అయినప్పటికీ తమ బ్యాటర్లు మెరుగైన పార్ట్నర్ షిప్ లు నమోదు చేయలేదని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని, ఇదో సానుకూల అంశమని పేర్కొన్నాడు. ఇక తాజా ఫలితంలో ఈ టోర్నీలో నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఆర్సీబీ నిలిచింది.
రాణించిన టిమ్ డేవిడ్.. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్షంతో కుదించిన ఈ మ్యాచ్ లో నిర్ణీత 14 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (50 నాటౌట్) సూపర్ ఫిఫ్టీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో అర్షదీప్ సింగ్, మార్కో యన్సెన్, యజ్వేంద్ర చాహల్, హర్ ప్రీత్ బ్రార్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనను పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి, పూర్తి చేసింది. నేహాల్ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. జోష్ హేజిల్ వుడ్ కు మూడు వికెట్లు దక్కాయి. ఇక సొంతగడ్డపై ఆర్సీబీకి ఇది మూడో ఓటమి కావడం విశేషం. ఆ జట్టు సాధించిన నాలుగు విజయాలు పరాయి గడ్డపై సాధించినవే కావడం గమనార్హం. సొంతగడ్డపై ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ ను కూడా పంజాబ్ కింగ్స్ తోనే ముల్లన్ పూర్ లో ఈనెల 20న ఆడుతుంది.