సునామీలు, భూకంపాలకు కేంద్రంగా మారే ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదయినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇండోనేషియా తూర్పు నుసా టెంగ్‌గెరా ప్రావిన్సుల్లో ఫ్లోరేస్ దీవికి ఉత్తరంగా భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. మొదట 7.6 తీవ్రత ఉన్నట్లు ప్రకటించారు. ఆపై భూకంప కేంద్రాన్ని గుర్తించి, తీవ్రతపై క్లారిటీ ఇచ్చారు. సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. 






మౌమెరే పట్టణానికి ఉత్తర దిశగా 100 కిలోమీటర్ల దూరంలో, సముద్రంలో 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే గుర్తించినట్లు తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించగా.. ఇది సునామీగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు ఒక నిమిషం పాటు ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం.






ఒక్కసారిగా భూమి కంపించడంతో ఫ్లోరేస్ ప్రజలు అప్రమత్తమయ్యారు. భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తూర్పు ఫ్లోరేస్ జిల్లా అధికారులు తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలో తరచుగా భారీ భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశం ఉందని జియాలాజికల్ సర్వే అధికారులు హెచ్చరిస్తుంటారు. గతంలో 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం అనంతరం సునామీగా మారి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. 
Also Read: Nellore News: ప్రాణం తీసిన OTS.. డబ్బులు కట్టలేక ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి..


Also Read: Weather Updates: ఏపీలో మరో 48 గంటలు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి