Donald Trump Wins Iowa Caucus: అమెరికా అయోవా స్టేట్‌లో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ (Republican Party) ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్‌ (Ron DeSantis)కు  21.4, నిక్కీ హేలీ (Nikki Haley)కి 17.7, వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)కి 7.2 శాతం ఓట్లు పడ్డాయి. అక్కడ ఎన్నికల ప్రచారం చేయకపోయినా రాన్ డీశాంటీస్‌, నిక్కీ హేలీని వెనక్కినెట్టిన ట్రంప్ మరో సారి తన సత్తా చాటారు.  


రిపబ్లికన్ అభ్యర్థిత్వం ఖరారు కావడానికి 1,215 ఓట్లు అవసరం కాగా.. మొదటి రౌండ్‌లోనే డొనాల్డ్ ట్రంప్‌కు 2,035 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోండటం వల్ల ఆయన ఆధిక్యత మరింత పెరిగే అవకాశం ఉంది. రాన్ డీశాంటీస్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 824 ఓట్లు వచ్చాయి. నిక్కీ హేలీ-682, వివేక్ రామస్వామి- 278 ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.


ట్రంప్ తుఫాన్ ఖాయం
అయోవాలో ట్రంప్‌కు వచ్చిన మెజారిటీతో డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బిడెన్‌ను ఎదుర్కోగల ఏకైక రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ అనే వాదనను బలపరుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ భారీ మెజారిటీతో గెలుస్తారని, అందుకు ఈ అయోవా ఎన్నికలే ఉదాహరణ అని ఆయన అభిమానులు, మద్దతు దారులు చెబుతున్నారు. 99 కౌంటీల్లో ట్రంప్ తుఫాన్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


ప్రచారం చేయని ట్రంప్
అయోవాలో డిశాంటిస్, నిక్కీ హేలీ ఇద్దరూ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు రోజు జరిగిన ప్రచారంలో రాన్ డీశాంటీస్‌ మాట్లాడుతూ.. "మీరు చలిని తట్టుకుని, నా కోసం తిరగడానికి సిద్ధంగా ఉంటే, నేను మీ కోసం రాబోయే ఎనిమిదేళ్లు పోరాడుతాను, మనం ఈ దేశాన్ని మలుపు తిప్పబోతున్నాం’ అంటూ అక్కడి ప్రజలను ఉద్దేశించి అన్నారు. నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు  తనకు, డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే అనూహ్యంగా ట్రంప్‌కు మెజారిటీ వచ్చింది. తన ప్రత్యర్థుల మాదిరిగా  ట్రంప్ ఇక్కడ ప్రచారం చేయలేదు. కేవలం ఆయన మద్దతుదారులు మాత్రమే ప్రచారం చేశారు. 


ఆకట్టుకున్న వివేక్ రామస్వామి
రేసులో నిలిచిన మరో వ్యక్తి వివేక్ రామస్వామి అందరి దృష్టిని ఆకర్శించారు. ట్రంప్‌కు ప్రత్యామ్నాయంగా ఆసక్తిని రేకెత్తించారు. అయితే ఓట్లను పొందడంలో విఫలమయ్యారు.  అయోవాలో విజయంతో డొనాల్డ్ ట్రంప్.. వరుసగా మూడోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైనట్టే. 2016 నాటి ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తరువాతి ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం చవి చూశారు.


కొన్ని నెలల పాటు ఎన్నికలు
రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు అమెరికాలో కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవా కాకసస్‌తో ఈ ప్రక్రియ మొదలైంది. తరువాత జనవరి 23న న్యూ హాంప్‌షైర్‌లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి.  


Also Read: అమెరికా ఎన్నికల్లో కీలక పరిణామం, పోటీ తప్పుకున్న వివేక్ రామస్వామి