Vivek Ramaswamy Quits Presidential Race: అమెరికా ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారతీయ - అమెరికన్, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు రామస్వామి ప్రకటించారు. సోమవారం జరిగిన అయోవా ప్రైమరీ పోరులో ఆయన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆయనకు 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్‌కు 1,215 ఓట్లు పోలయ్యాయి.
అంతకు ముందు ట్రంప్, నిక్కీహేలీపై విమర్శలు
సోషల్ మీడియా వేదికగా తన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), నిక్కీ హేలీల (Nikki Haley)పై విమర్శలు చేశారు. తాను ట్రంప్‌కు అడుగడుగునా అండగా నిలిచానని, అతన్ని అపారంగా గౌరవిస్తానని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితల్లో తాను ఓటు అడుగుతున్నట్లు చెప్పారు. ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకోవద్దని, కొందరు తోలుబొమ్మల మాస్టర్లు సైలెంట్‌గా నిక్కీని అధికారంలోకి తీసుకురావడానికి చూస్తున్నారంటూ ఆరోపించారు. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు.
అలాగే ట్రంప్ తనపై చేసిన వ్యాఖ్యలకు రామస్వామి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఎక్కడికీ విసిరివేయబడలేదని, కానీ తనను వెనక్కి నెట్టేందుకు ఒక ప్రయత్నం జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ విషయాన్ని తాను తేలికగా తీసుకున్నాని చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం లేదన్నారు. ప్రధాన మీడియా వాస్తవాలను విస్మరిస్తోందని, ఆ విషయం తనకు తెలుసని రామస్వామి అన్నారు.
అది అమెరికా కల
రామస్వామి తన ‘అమెరికన్ డ్రీమ్’ గురించి వివరించారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో తాను చెప్పిన విషయాలను పంచుకుంటూ ట్విటర్‌లో న్యూస్ క్లిప్‌ను పంచుకున్నారు. తాను వ్యాపారవేత్తనని, రాజకీయ నాయకుడిని కాదని రాసుకొచ్చారు. తన తల్లిదండ్రులు డబ్బు లేకుండా 40 సంవత్సరాల క్రితం ఈ దేశానికి వచ్చారని, ఇప్పుడు తాను మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలను కనుగొన్నానని పేర్కొన్నారు. అపూర్వను పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకులను పెంచుకుంటూ జీవితంలో ఉన్నతంగా ఎదిగానని చెప్పారు.
రిపబ్లిక్ పార్టీ తరఫున బరిలో
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో దిగేందుకు డోనాల్డ్ ట్రంప్‌తో భారత సంతతి నేత వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ‘సేవ్ ట్రంప్, వోట్ వివేక్’ అని రాసున్న టీషర్టులు వివేక్ రామస్వామి ప్రచారం చేశారు. దీంతో ట్రంప్, ఆయన మద్దతుదారులు ఆగ్రహానికి లోనైనట్టు అమెరికా మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వివేక్‌ను టార్గెట్ చేస్తూ ట్రంప్ తొలిసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వివేక్ ప్రచార గిమ్మికులకు మోసపోవద్దని సూచించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారుడిగా వివేక్ తన ప్రచారాన్ని ప్రారంభించాడని, కానీ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని ట్రంప్ ఆరోపించాడు. వివేక్‌కు ఓటు వేయడమంటే ప్రత్యర్థికి ఓటు వేయడమేనని, ఈ ప్రచారంతో మోసపోవద్దని కోరారు. వివేక్ అవినీతి పరుడు, ఆర్థిక నేరగాడని ట్రంప్ ఆరోపించారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయ్నతిస్తున్నాడని విమర్శించారు. వివేక్‌కు ఓటు వేసి మీ ఓటును వ్యర్థం చేసుకోవద్దదంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.