Trump Twitter Account:  ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేశారు. దాదాపు 22 నెలల తర్వాత ట్విట్టర్ లో మళ్లీ ట్రంప్ ఖాతా శనివారం కనిపించింది. గతేడాది జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్ వద్ద హింసను ప్రేరేపించింనందుకు ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేశారు.


ట్రంప్ ఖాతాను పునరుద్ధరించేందుకు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. 15 మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ట్రంప్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి అనుకూలంగా 51.8 శాతం ఓట్లు వచ్చాయి. అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేసి, అకౌంట్ పునరుద్ధరించారు. 


నేను తిరిగిరాను..


ట్విట్టర్ కి తిరిగి రావడానికి తనకు ఆసక్తి లేదని ట్రంప్ భిన్నంగా స్పందించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అభివృద్ధి చేసిన తన కొత్త ఫ్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇది ట్విట్టర్ కంటే మెరుగ్గా ఉందని ట్రంప్ అన్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. రిపబ్లికన్ యూదుల సంకీర్ణ వార్షిక నాయకత్వ సమావేశంలో ప్యానెల్ ద్వారా ట్విట్టర్‌కు తిరిగి రావాలని అలోచిస్తున్నారా అన్న ప్రశ్నకు " తిరిగి రావడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు," అని అమెరికా మాజీ అధ్యక్షుడు చెప్పారు.






ట్విట్టర్ బ్లూ టిక్‌తో మళ్లీ వస్తున్నాం


ప్రస్తుతానికి నిలిపివేసిన ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ బుధవారం ప్రకటించారు. ట్విట్టర్‌ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ ఎలాన్ మస్క్ "బ్లూ వెరిఫైడ్ రీలాంచ్ నవంబర్ 29వ తేదీన జరగనుంది. ఈసారి దాన్ని రాక్ సాలిడ్ అని నిర్ణయించుకున్నాకనే తీసుకువస్తాం." అని తెలిపాడు.


చాలా చర్చలకు దారి తీసిన ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత బ్లూ టిక్ వెరిఫికేషన్ లేబుల్‌లను నవంబర్‌ 11వ తేదీన తాత్కాలికంగా నిలిపివేశారు. వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ని కోరుకునే వినియోగదారుల నుంచి నెలకు 8 డాలర్లను ట్విట్టర్ వసూలు చేయడం ప్రారంభించింది. అయినప్పటికీ ట్విట్టర్‌లో అనేక నకిలీ "వెరిఫైడ్" ఖాతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఫేక్ అకౌంట్‌పై ఎదురుదాడికి దిగిన మస్క్, వేరొకరిలా నటించడానికి ప్రయత్నించే ఏ ఖాతా అయినా అది పేరడీ ఖాతాగా ప్రకటించకపోతే డిజేబుల్ అవుతుందని ట్వీట్ చేశాడు.


ట్విట్టర్ తను తొలగించిన ఉద్యోగుల్లో కొందరిని తిరిగి సంప్రదించినట్లు తెలుస్తోంది. వారిని పొరపాటున తీసేశామని చెప్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో పేర్కొంది. మస్క్ ఊహించిన కొత్త ఫీచర్లను రూపొందించడానికి వారి అనుభవం అవసరమని మేనేజ్‌మెంట్ గ్రహించకముందే కొందరిని తీసేశారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.


సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గత వారం ఈమెయిల్ ద్వారా దాదాపు 3,700 మంది వ్యక్తులను తొలగించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఈ-మెయిల్, స్లాక్ వంటి కంపెనీ సిస్టమ్‌లకు వారి యాక్సెస్‌ను అకస్మాత్తుగా సస్పెండ్ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కొందరిని తిరిగి రమ్మనడం ఉద్యోగులను తొలగించే విషయంలో కంపెనీ ఎంత అస్తవ్యస్తమైన ప్రక్రియను పాటించిందో తెలియజేస్తుంది.