US Presidential Elections:
బైడెన్‌ని బీట్ చేసిన ట్రంప్..
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు (US President Polls 2024) జరగనున్నాయి. ఇప్పటి నుంచే ఆ సందడి, హడావుడి కనిపిస్తోంది. ఈ సారి జో బైడెన్‌కి పోటీగా ఇద్దరు రంగంలోకి దిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా పోటీలో ఉన్నారు. "గెలిచేది నేనే" అని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్‌కి సర్వేలు అనుకూలంగా ఉండడం ఆసక్తికరంగా మారింది. ABC News, Washington Post చేపట్టిన సర్వేలో బైడెన్ కన్నా ట్రంప్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. గతంలో ఇదే సర్వేలో బైడెన్‌కి 19 పాయింట్లు తక్కువగా వచ్చాయి. మరోసారి ఈ మధ్య సర్వే నిర్వహించగా బైడెన్ కన్నా 10 పాయింట్‌లు ఎక్కువగా సంపాదించుకున్నారు ట్రంప్. బైడెన్ అమెరికా ఎకానమీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని, వలసలనూ ఆపలేకపోయారన్న అసహనం ఓటర్లలో కనిపించినట్టు సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వేలో 44% మంది అమెరికా పౌరులు బైడెన్ హయాంలో తమ ఆర్థిక స్థితి బాగా పడిపోయిందని చెప్పారు. ఎకానమీ విషయానికొస్తే కేవలం 30% మంది పౌరులు మాత్రమే బైడెన్‌కి అనుకూలంగా ఓటు వేశారు. అమెరికా-మెక్సికో సరిహద్దు వివాదం, వలసల విషయంలో కేవలం 23% మంది మాత్రమే బైడెన్‌కి మంచి మార్కులు ఇచ్చారు. ఓవరాల్‌గా చూసుకుంటే బైడెన్ పని తీరుకి 37% ఓట్లు పడ్డాయి. 56% మంది వ్యతిరేకించారు. ఆయన వయసు గురించీ ఈ సర్వేలో చాలా మంది ప్రజలు చర్చించారు. వయోభారంతో దేశాన్ని ఎలా నడుపుతారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువే అని చెప్పారని సర్వే వెల్లడించింది.
మరోసారి అవకాశం ఇస్తారా..?
అగ్రరాజ్యం ఇలా అయిపోవడానికి కారణం డెమొక్రాట్లే అని 40% మంది చెప్పగా రిపబ్లికన్లే అని 33% మంది వెల్లడించారు. అటు ట్రంప్ రేటింగ్ పెరిగింది. 2021లో ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే నాటికి 38% మంది మద్దతునివ్వగా..ఇప్పుడా సంఖ్య 48%కి పెరిగింది. అయినా ఇప్పటికీ 49% మంది ట్రంప్ పని తీరుపై అసహనంతోనే ఉన్నారు. దాదాపు 75% మంది ట్రంప్‌కి మరోసారి అవకాశమివ్వాలని కోరుకుంటున్నట్టు వెల్లడైంది. అయితే...2020 ఎన్నికల్లో తనను కుట్రపూరితంగా ఓడించారన్న ట్రంప్ ఆరోపణల్ని మాత్రం అమెరికన్లు కొట్టి పారేస్తున్నారు. దాదాపు 60% మంది ఆయన వ్యాఖ్యన్ని ఖండించారు. ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి 8% మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. మొత్తంగా చూసుకుంటే...2024 నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్‌కి 51% మేర సపోర్ట్ ఉండగా...బైడెన్‌కి 42% వరకూ ఉంది. ఇది మారే అవకాశాలూ ఉన్నాయని సర్వే తెలిపింది. ఇప్పటికే అనధికారికంగా ప్రచారం మొదలు పెట్టిన ట్రంప్‌కి ఈ సర్వే మరింత జోష్ ఇవ్వనుంది. మొత్తానికి వచ్చే అమెరికా ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగనున్నాయని అర్థమవుతోంది. బైడెన్‌కి ప్రజలు మరోసారి అవకాశమిస్తారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.