హ్యుమనాయిడ్‌ రోబో అనగానే రజనీకాంత్‌ రోబో సినిమానే గుర్తొస్తొంది. అచ్చం ఆ సినిమాలో లాగానే ఎలాన్‌ మస్క్‌కు చెందిన ప్రముఖ టెస్లా కంపెనీ తయారు చేసిన హ్యూమనాయిడ్‌ రోబో ఆప్టిమస్‌ రకరకాల పనులను చేస్తోంది. తాజాగా ఈ రోబో యోగా చేసిన వీడియోను ఆదివారం  టెస్లా ఆప్టిమస్‌ సోషల్‌ మీడియా ఖాతా ఎక్స్‌లో షేర్‌ చేసింది. ఆప్టిమస్‌ రోబో పలు రకాల పనులను సొంతగా చేస్తోంది. ఇందులో భాగంగా కలర్ బ్లాక్స్‌ను రంగుల ఆధారంగా వేరు చేస్తోంది. అలాగే యోగా కూడా చేసింది. మనిషి లాగానే వేళ్లను కదిలిస్తూ దాదాపుగా అదే వేగంతో బ్లాక్స్‌ను వేరుచేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. మనుషులు రోబో చేసే పనిలో జోక్యం చేసుకుని ఆ పనిని కొంచెం కష్టతరంగా మార్చినా కూడా రోబో వెంటనే ఆ మార్పును అర్థం చేసుకుని టాస్క్‌ను పూర్తిచేస్తుందని టెస్లా కంపెనీ పేర్కొంది.


ఆ తర్వాత రోబో యోగా భంగిమలను ప్రదర్శించింది. ఒక కాలు మీద నిలబడి ఇంకా కాళ్లను స్ట్రెచ్‌ చేస్తూ పలు యోగాసనాలను చేసింది. రెండు చేతులు దగ్గరికి జోడించి నమస్తే చెప్తున్న భంగిమను కూడా ఆప్టిమస్‌ ప్రదర్శించింది. ఈ రోబోకు సొంతగా కాళ్లను, చేతులను నియత్రించుకోగల సామర్థ్యం వచ్చిందని కంపెనీ వెల్లడించింది. అధికారిక టెస్లా ఆప్టిమస్‌ ఎక్స్‌ ఖాతాలో వీడియోను పోస్ట్‌ చేస్తూ కంపెనీ ఈ విధంగా పేర్కొంది..'ఆప్టిమస్‌ ఇప్పుడు వస్తువులను స్వయంగా క్రమబద్ధీకరించగలదు. దీని న్యూరల్‌ నెట్‌వర్క్‌ పూర్తిగా ఎండ్‌-టు-ఎండ్‌ శిక్షణ పొందింది. ఆప్టిమస్‌ను ఇంకా డెవలప్‌ చేయడానికి మాతో చేతులు కలపండి(దాని యోగా దినచర్యను కూడా ఇంప్రూవ్‌ చేయండి)' అని పోస్ట్‌ చేసింది.


టెస్లా ఆప్టిమస్‌ విడుదల చేసిన ఈ వీడియో పట్ల నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపించారు. చాలా మంది ఇది చాలా ఇంప్రెస్సివ్‌గా ఉందంటూ కామెంట్లు చేశారు. ఆప్టిమస్‌ చాలా మృదువుగా ఉంది, నేను చాలా ఇంప్రెస్‌ అయ్యాను అంటూ పోస్ట్‌ చేశారు. మరొకరు టెస్లా బృందం నుంచి అద్భుతమైన పురోగతి ఇది అని ట్వీట్‌చేశారు. తర్వాతి పురోగతిని చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మైండ్‌-బ్లోయింగ్‌ ప్రోగ్రెస్‌ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. రోబో కదలికలను ఈ విధంగా చేయగలగడం చాలా గొప్ప అంటూ మరొకరు, ఆప్టిమస్‌ సరిగ్గా నడవడం కూడా రాని స్టేజి నుంచి ఇక్కడి దాకా తీసుకురావడం చూస్తుంటే నోట మాట రావట్లేదని ట్వీట్లు చేశారు. టెస్లా ఏఐ బృందంపై ప్రశంసలు కురిపించారు. వెల్‌ డన్‌ టెస్లా అంటూ ఎంతో మంది నెటిజన్లు అభినందనలు తెలిపారు.







ఆప్టిమస్‌ను టెస్లాబోట్‌ అని కూడా పిలుస్తారు. దీనిని తయారుచేస్తున్నట్లు 2021లోనే టెస్లా కంపెనీ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ డే ఈవెంట్‌లో ప్రకటించింది. 2022లో టెస్లా కంపెనీ రోబో సెమి ఫంక్షనల్‌ ప్రొటోటైప్‌ను ప్రపంచానికి చూపించింది. 2023లో దీనిని ప్రొడక్షన్‌కు తయారుచేస్తామని తెలిపింది. మనుషులు చేసే ఎన్నో పనులు చేయగలిగేలా ఈ రోబోను తీర్చిదిద్దుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. టెస్లా కంపెనీ కార్ల కంటే కూడా భవిష్యత్తులో తమకు రోబోల వ్యాపారం ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుందని ఎలాన్‌ మస్క్‌ నమ్ముతున్నారు. ఈ ఆప్టిమస్‌ అనే రోబో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉంటుంది. 57కేజీల బరువు ఉంటుంది.