మణిపూర్‌లోని బీరేన్ సింగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌-మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కి.మీ. మేర కంచె నిర్మించేందుకు సిద్ధమవుతోంది. సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్  చర్చలు జరిపారు. మయన్మార్ సరిహద్దులో 70 కిలోమీటర్ల మేర అదనపు కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. మణిపూర్ కు మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోలను వెంటనే నిలిపివేసి సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


ఫ్రీ మూవ్‌మెంట్ రెజిమ్ కారణంగా భారత్‌-మయన్మార్‌ ప్రజలు ఇరువైపులా, ఎలాంటి పత్రాలు లేకుండా 16 కి.మీ మేర తిరగవచ్చని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఈ కారణంగా అక్రమ వలసదారులు భద్రతా సిబ్బంది కంట పడకుండా తప్పించుకుంటున్నారని వెల్లడించారు. సరిహద్దులోని లోపాల కారణంగా పొరుగు దేశం నుంచి అక్రమ వలసలు, స్మగ్లింగ్‌ కార్యకలాపాలు పెరుగుతున్నాయని బీరేన్‌ సింగ్‌ వెల్లడించారు. అందుకే అత్యవసరంగా అదనపు కంచె ఏర్పాటు చేయాలని కోరారు. మణిపూర్ మయన్మార్ సరిహద్దులో అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోకల కారణంగానే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయని ప్రభుత్వం భావిస్తోంది. మయన్మార్ నుంచి ఈ రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. రెండు దేశాల పౌరులు 16 కిలోమీటర్లు వరకు ఎలాంటి ఆధారాలు లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చు.  


మయన్మార్, ఇండియాతో 1600 కి.మీ. సరిహద్దును పంచుకుంటోంది. మణిపూర్‌లోని ఐదు జిల్లాలు, మయన్మార్‌తో  390 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఖర్చుతోపాటు అక్కడి స్థితిగతులు అనుకూలంగా లేనికారణంగా మొత్తం సరిహద్దు అంతటా కంచె వేయడం కష్టమే. దీంతో ఎక్కడైతే అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయో, అక్కడ మాత్రమే కంచె వేస్తే సమస్యకు కాస్తైనా పరిష్కారం దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగానే 70 కిలోమీటర్ల పాటు కంచెను వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 


మణిపూర్ లో చెలరేగిన జాతుల విధ్వంసకాండ దేశాన్ని కుదిపేసింది. ఐదు నెలలుగా మణిపూర్ లోని మైతేయి, కుకీజాతుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం యుద్ధంగా మారి బీభత్సాన్ని సృష్టించింది. ఈ హింసాకాండ, ఆగని ఈ విధ్వంసకాండ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాలు మణిపూర్ అల్లర్లను అస్త్రంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించాయి. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మైతేయి సముదాయం చేతిలో కుకీ జాతి ప్రజలు హత్యలకు గురయ్యారు. లక్షలాదిగా నిర్వాసితులయ్యారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. 


ఐదు నెలలుగా మణిపూర్లో కొనసాగుతున్న ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. దాదాపు 5 నెలల పాటు మణిపూర్లో ఇంటర్నెట్ నిషేధం అమలులో ఉంది. అక్కడ ఏం జరుగుతుందో.. ఎవరు ఏ అమానుషత్వానికి, ఏ అరాచకానికి బలవుతున్నారో.. బయట ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా ఇంటర్ నెట్ సేవలను సడలించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.