ఇన్ఫోసిన్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగా, రచయిత్రిగా సుధామూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు ఉపయోగించుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అమెరికాలో జరిగే ఈవెంట్లకు ఆమె హాజరవుతారని చెబుతూ, కొందరు డబ్బులు వసూలు చేశారని సుధామూర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల పేరు చెప్పి నగదు వసూలు చేయడంపై సుధామూర్తి  సీరియస్‌ అయ్యారు. ఆమె తరఫున ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్ మమత సంజయ్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు. 


అమెరికాలో సెప్టెంబరు 26న జరగనున్న మీట్ అండ్‌ గ్రీట్ కార్యక్రమానికి సుధామూర్తి హాజరవుతారంటూ... శ్రుతి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు డబ్బు తీసుకుంది. ఈ వ్యవహారం సుధామూర్తి కార్యాలయం దృష్టికి రావడంతో సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు సుధామూర్తికి కన్నడకూట నార్తన్‌ కాలిఫోర్నియా  50వ వార్షికోత్సవం సందర్భంగా ఆహ్వానం అందింది. బిజీ షెడ్యూల్‌ కారణంగా, ఆమె ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ తాను ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరవుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ  విషయం ఆగస్టు 30న ఆమె దృష్టికి చేరింది. లావణ్య అనే మహిళ సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి మోసం చేసినట్లు తేలింది. లావణ్య, శ్రుతి పేరుతో మోసం చేసిన వారిపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసానికి పాల్పడిన మహిళలు ఇండియాలోనే ఉన్నారా? లేక అమెరికాలో ఉన్నారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.