India Canada News: కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (45) హత్య భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నిజ్జర్ హత్య వెనుక భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడింది. నిజ్జర్ హత్యకు భారత్ ప్రభుత్వం బాధ్యత వహించాలని కెనడా వ్యాఖ్యానించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజ్జర్ హత్యకు భారత్‌కు ఎలాంటి సంబంధం లేదని గట్టిగానే సమాధానం ఇచ్చింది. భారత్ సమాధానాన్ని అసంబద్ధం, ప్రేరేపితం అంటూ కెనడా ఆ దేశంలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. దీనికి భారత్ సైతం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. కెనడా దౌత్యవేత్తను ఐదు రోజుల్లో భారత్ వదలివెళ్లాలని ఆదేశించింది.
‘భారత్ భాగస్వామ్యం కీలకం’
నిజ్జర్ హత్యకు ముందు భారతదేశంతో కెనడా వాణిజ్యం, రక్షణ, ఇమ్మిగ్రేషన్ సంబంధాలను ఏర్పరచుకోవాలని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో భావించారు. అయితే నిజ్జర్ హత్యతో అది కాస్తా దెబ్బతింది. ది వెస్ట్ బ్లాక్‌లో ఆదివారం ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో భారత్-కెనడా దౌత్య వివాదం గురించి రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ మాట్లాడారు. ఇది సవాలుతో కూడుకున్న సమస్య అని, దేశ చట్టాన్ని, తమ పౌరులను రక్షించడం తమ బాధ్యత అని అన్నారు. నిజ్జర్ హత్యపై విచారణ కొనసాగుతోందని, భారత్‌తో కెనడా తమ భాగస్వామ్యాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత్‌తో తమ సంబంధానికి ఇది సవాలుతో కూడుకున్న సమస్య అని, దానిని తాము అర్థం చేసుకున్నామని అన్నారు.
‘నిజాన్ని తేల్చడం మా బాధ్యత’
అదే సమయంలో, చట్టాన్ని రక్షించడం, పౌరులను రక్షించడం, అదే సమయంలో సమగ్ర విచారణ జరిపి నిజాన్ని తేల్చడం తమ బాధ్యత అని బిల్ బ్లెయిర్ అన్నారు. ఆరోపణలు నిజమని రుజువైతే, కెనడియన్ గడ్డపై కెనడియన్ పౌరుడి హత్యలో తమ సార్వభౌమాధికారాన్ని భారత్ ఉల్లంఘించినట్లు అవుతుందని, ఇది ఆందోళన కలిగించే విషయం అన్నారు. కెనడాకు ఇండో-పసిఫిక్ వ్యూహం ఇప్పటికీ కీలకమైనదేనని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఐదేళ్లలో సైనిక ప్రాధాన్యతల కోసం $492.9 మిలియన్లను కేటాయించిందని, అన్నీ కలుపుకుని మొత్తం $2.3 బిలియన్ల వరకు ఉంటుందన్నారు.
కెనడా ప్రభుత్వానికి భారత్ రిక్వెస్ట్
నిజ్జర్ హత్యపై కెనడా, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కెనడియన్‌లకు వీసా సేవలను నిలిపివేసింది. అలాగే కెనడాలో ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని గురవారం కెనడాను భారత్ కోరింది. దౌత్యపరమైన విషయంలో ఇరు దేశాలు సమానత్వం పాటించాలని, ఢిల్లీలోని తన దౌత్య సిబ్బందిని తగ్గించాలని కెనడాను భారత్ కోరింది. కెనడాలో ఉన్న భారత దౌత్య సిబ్బంది కంటే న్యూఢిల్లీ కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంది.
భారత్ నుంచి కెనడా వలస వెళ్లిన హరదీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాడు. ఈ నేపథ్యంలో 2020లో నిజ్జర్‌ను భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఖలీస్థానీ వేర్పాటువాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని, ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తోందని భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. జూన్ 18న హరదీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేయడంతో భారత్, కెనడా మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.